
యూరియా కోసం రోడ్డెక్కిన అన్నదాతలు
నవాబుపేట/భూత్పూర్: వారం పది రోజులుగా ప్రతి రోజూ వస్తున్నా.. యూరియా దొరకడం లేదనే ఆగ్రహంతో మంగళవారం జిల్లాలో భూత్పూర్, నవాబుపేట, మూసాపేట మండల కేంద్రాల్లో అన్నదాతలు రోడ్డెక్కారు. భూత్పూర్‌లో రైతులు రాస్తారోకో చేయడంతో సీఐ రామకృష్ణ ఫోన్ చేసి మండల వ్యవసాయాధికారి మురళీధర్‌ను పిలిపించారు. బుధవారం లోగా యూరి యా ఇస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. నవాబుపేటలోని అంబేద్కర్ చౌరస్తా, ఎర్రసత్యం చౌరస్తాలో రైతులకు మద్దతుగా బీఆర్‌ఎస్ నాయకులు ధర్నా చేశారు. దాదాపు మూడు గంటల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా ముందస్తు ప్రణాళిక లేకపోవడం, అసమర్థ ప్రభుత్వం వల్ల యూరియా కొరత ఏర్పడిందని విమర్శించారు.తహసీల్దార్ శ్రీనివాస్, ఎస్‌ఐ విక్రమ్ సంఘటన స్థలానికి చేరుకుని కలెక్టర్‌తో మాట్లాడి.. రోజుకు రెండు లారీల చొప్పున యూరియా అందించేలా హామీ ఇప్పించడంతో రైతులు ఆందోళన విరమించారు. ధర్నాలో బీఆర్‌ఎస్ నాయకులు రవీందర్‌రెడ్డి, నర్సింహులు, లక్ష్మయ్య, శ్రీనివాస్, నాగిరెడ్డి పాల్గొన్నారు.