
జూరాలకు నిలకడగా వరద
ధరూరు/ రాజోళి/ ఆత్మకూర్: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి 8 గంటల వరకు 3.72 లక్షల క్యూసెక్కులు రావడంతో ప్రాజెక్టు 37 క్రస్టు గేట్లను ఎత్తి 3,53,573 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అలాగే ఎడమ కాల్వకు 820 క్యూసెక్కులు, కుడి కాల్వకు 490, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కులు వదలగా మరో 41 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.585 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా.. ఆల్మట్టి ప్రాజెక్టుకు 2,75,568 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. దిగువకు 2 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో నారాయణపూర్ ప్రాజెక్టుకు 2.10 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 30 గేట్లను ఎత్తి 1,70,340 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
సుంకేసులలో 9 గేట్టు ఎత్తివేత
సుంకేసులలో 9 గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నట్లు జేఈ మహేంద్ర తెలిపారు. ఆదివారం ఎగువ నుంచి 42 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రాగా.. 38,493 క్యూసెక్కులు దిగువకు విడుదల చేసి కేసీ కెనాల్‌కు 2,626 క్యూసెక్కులు విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
విద్యుదుత్పత్తికి ఆటంకం
జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీస్థాయిలో వరద నీరు వస్తుండటంతో దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ఆటంకం కలుగుతోంది. అత్యధికంగా వరద నీరు వస్తుండడంతో ఉత్పత్తి సాధ్యమవదని ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. కాగా ఎగువ, దిగువ జల విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 533.580 మి.యూ., చేపట్టామని ఆయన పేర్కొన్నారు.