
భారీ కొండచిలువ పట్టివేత
కొత్తకోట రూరల్: పెద్దమందడి మండలం దొండగుంటపల్లి శివారులోని రేణు సోలార్ ప్లాంట్ వద్ద శనివారం మధ్యాహ్నం భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. గుర్తించిన సోలార్ కంపెనీ సెక్యూరిటీ సిబ్బంది వెంటనే మేనేజర్ వసంతరావు, ఖిల్లాఘనపురం మండల ఫారెస్ట్ రేంజర్ అధికారి మంజులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీ సిబ్బంది కొండచిలువ కోసం గాలింపు చర్యలు చేపట్టడంతో పాటు సాగర్ స్నేక్ సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్‌కు సమాచారం అందించారు. వెంటనే తన బృందంతో అక్కడికి చేరుకున్న కృష్ణసాగర్ అతి కష్టం మీద కొండచిలువను సురక్షితంగా బంధించారు. కొండచిలువ 14అడుగుల పొడవు, 23కిలోల బరువు ఉందని, దానిని బలిజపల్లి–జంగమయ్యపల్లి అటవీ ప్రాంతంలో వదిలివేస్తామని కృష్ణసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ కంపెనీ పరిసర ప్రాంతాలు అడవి పందులు, కుందేళ్లకు అనువైన వాతావరణం కలిగినందున వాటిని వేటాడి తినడానికే కొండచిలువ తరచుగా వస్తోందని, గతంలో కూడా రైతులు ఈ ప్రాంతంలో కొండచిలువలు ఎక్కువగా సంచరిస్తున్నాయని తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. పాములన్నీ విషపూరితమైనవి కావని, కనిపిస్తే వాటిని చంపకుండా తమకు సమాచారం ఇస్తే పట్టుకుని అడవుల్లో వదిలేస్తామన్నారు. కార్యక్రమంలో స్నేక్ సొసైటీ సభ్యులు చిలుక కుమార్, అవినాష్, ఫారెస్ట్ అధికారి వంశీ తదితరులు పాల్గొన్నారు.
ఆరు అడుగుల కొండచిలువ..
గోపాల్‌పేట: మండలంలోని తాడిపర్తి పెద్దచెరువు అలుగు వద్ద ఆదివారం జాలర్లు వేసిన వలలో కొండచిలువ చిక్కుకుంది. గుర్తించిన స్థానిక రైతు స్నేక్‌సొసైటీ వ్యవస్థాపకుడు కృష్ణసాగర్‌కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఆయన చెరువు అలుగు వద్దకు చేరుకుని వలలో చిక్కుకున్న కొండచిలువను వలలో నుంచి బయటకు తీసి బంధించాడు. అనంతరం గోపాల్‌పేట సెక్షన్ ఆఫీసర్ స్వప్న సమక్షంలో అటవీప్రాంతంలో వదిలిపెట్టారు.