
‘నేనుసైతం’ పూజాసామగ్రి పంపిణీ
మెట్టుగడ్డ: వినాయక చవితిని పురస్కరించుకుని 711 పురాతన ఆలయాలు, వినాయక మండపాలకు పూజాసామగ్రిని పంపిణీ చేస్తున్నట్లు సామాజిక కార్యకర్త, నేనుసైతం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు దిడ్డి ప్రవీణ్‌కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలో సంస్థ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వినాయక మండపాలకు అవసరమయ్యే 31రకాల పూజాసామగ్రితోపాటు, పురాతన ఆలయాల్లో నిత్యపూజకు అవసరమయ్యే సామగ్రిని అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాతోపాటు నారాయణపేట, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, జిల్లాలోని పలు ఆలయాలకు ధూపదీప కార్యక్రమ సామగ్రి పంపిణీ చేసినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఉచిత పూజాసామగ్రి పంపిణీ చేపడుతున్నామని తెలిపారు.
సొంత నిధులతోనే..
నేనుసైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజాసామగ్రిని సొంత నిధులతోనే పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వినాయక చవితి పండుగను ప్రతిఒక్కరూ భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో నేనుసైతం సభ్యులు పవన్‌కుమార్, శ్రీనివాస్, ప్రియ, లక్ష్మీనారాయణ, సత్యం, దస్తయ్య, శ్రీహరి, గణేశ్‌రావు, తదితరులు పాల్గొన్నారు.