
ఇద్దరు దొంగల అరెస్టు
నాగర్‌కర్నూల్ క్రైం: జల్సాలకు అలవాటుపడి ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు బైక్‌లు, ఒక ఆటోను రికవరీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం నాగర్‌కర్నూల్ సర్కిల్ పోలీసు కార్యాలయంలో సీఐ అశోక్‌రెడ్డి వెల్లడించారు. ఆయన వివరాల మేరకు.. పెద్దకొత్తపల్లి మండలం వావిళ్లబావికి చెందిన శాగాది యుగంధర్, జిల్లా కేంద్రంలోని వినోబానగర్ కాలనీకి చెందిన వేపూరి నీలాంబర్ స్నేహితులు. ఇరువురు జల్సాలకు అలవాటుపడి హైదరాబాద్, నాగర్‌కర్నూల్ తదితర ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. గత నెల 29న జిల్లా కేంద్రంలోని ఓ ఇంటి ఎదుట నిలిపిన ద్విచక్ర వాహనాన్ని చోరీ చేయడంతో.. బాధితుడు ఈ నెల 1న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శనివారం జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో అనుమానాస్పదంగా తిరుగుతున్న శాగాది యుగందర్, వేపూరి నీలాంబర్‌లను అదుపులోకి తీసుకున్నారు. తమదైన శైలిలో వారిని విచారించడంతో ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్నట్లు నేరం అంగీకరించారు. నిందితుల నుంచి రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఉప్పల్, వనస్థలీపురం, మేడిపల్లి పోలిస్టేషన్‌తో పాటు నాగర్‌కర్నూల్, కల్వకుర్తి పోలిస్‌స్టేషన్ పరిధిలో చోరీకి గురైన నాలుగు ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను రికవరీ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ గోవర్ధన్, పట్టణ రెండో ఎస్‌ఐ వినోద్, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు వెంకటేశ్, రమేశ్, భీముడు ఉన్నారు.
4 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో రికవరీ