
కురుమూర్తి క్షేత్రం.. భక్తజన సంద్రం
● అమావాస్య సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు
● స్వామివారికి ప్రత్యేక పూజలు
● మార్మోగిన గోవింద నామస్మరణ
చిన్నచింతకుంట: శ్రావణమాసం చివరి శనివారం, అమావాస్య సందర్భంగా అమ్మాపూర్ కురుమూర్తి స్వామి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చి స్వామివారి దర్శనానికి క్యూ కట్టారు. అర్చకులు ఆలయాన్ని శుద్ధిచేసి.. సుప్రభాత సేవ నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలు కల్పించారు. ఈ సందర్భంగా గోవింద నామస్మరణ మార్మోగింది. కొందరు భక్తులు కొండ దిగువన మట్టికుండలో పచ్చిపులుసు అన్నం నైవేద్యంగా తయారుచేసి స్వామికి సమర్పించారు. మరికొందరు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం కొండపైన అలివేలు మంగమ్మ, చెన్నకేశవస్వామి, ఆంజనేయ స్వామి, ఉద్దాలను భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో రద్దీగా కనిపించింది. జాతర మైదానంలో ఏర్పాటుచేసిన దుకాణాలు కొనుగోలుదారులతో సందడిగా మారాయి.
● కురుమూర్తిస్వామిని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి.. స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించి శాలువాతో సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే తన సొంత ఖర్చుతో భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ గోవర్ధన్‌రెడ్డి, ఈఓ మదనేశ్వర్‌రెడ్డి, కమిటీ సభ్యులు బాదం వెంకటేశ్వర్లు, భారతమ్మ, నాగరాజు, భాస్కరాచారి ఏర్పాట్లను పర్యవేక్షించారు.
జాతర మైదానంలో భక్తుల జాగరణ

కురుమూర్తి క్షేత్రం.. భక్తజన సంద్రం

కురుమూర్తి క్షేత్రం.. భక్తజన సంద్రం