
భార్యాభర్తలను విడదీశాడన్న అనుమానంతో హత్య
● వృద్ధుడి హత్య కేసును
ఛేదించిన పోలీసులు
● నిందితుడి అరెస్టు
వనపర్తి రూరల్: పాన్‌గల్ మండల కేంద్రానికి చెందిన ఎనుముల కిష్టయ్య (65) హత్య కేసును పోలీసులు ఛేదించారు. అదే గ్రామానికి చెందిన వసంతపురం రాములు తన భార్య తనను విడిచివెళ్లడానికి కిష్టయ్య కారణమనే అనుమానంతో హతమార్చినట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం వనపర్తి సీఐ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో డీఎస్పీ వెల్లడించారు. పాన్‌గల్‌కు చెందిన ఎనుముల కిష్టయ్య గొర్రెల వ్యాపారం చేసుకొని జీవించే వాడు. అయితే అదే గ్రామానికి చెందిన వసంతపురం రాములు, తన భార్య మధ్య కిష్టయ్య గొడవపెట్టడంతోనే తనను విడిచిపెట్టి వెళ్లిందనే అనుమానంతో పాటు ఎలాగైనా బైక్ కొనాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం ఈ నెల 20న రాత్రి ఇంట్లో ఒంటరిగా నిద్రిస్తున్న కిష్టయ్యపై పప్పుగుత్తితో దాడిచేసి హతమార్చాడు. అనంతరం కిష్టయ్య జేబులో ఉన్న రూ. 40వే నగదు దోచుకొని.. పప్పుగుత్తిని ఎవరు గుర్తించకుండా మురుగు కాల్వలో పడేశాడు. మృతుడి కుమారుడు ఎనుముల శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. శనివారం పాన్‌గల్‌లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వసంతపురం రాములును అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో చేసిన నేరం అంగీకరించి.. హత్యకు వినియోగించిన పప్పుగుత్తి కాడ, రక్తపు మరకలు ఉన్న బట్టలను చూయించాడు. నిందితుడిని అరెస్టు చేసి రూ. 34వేలు రికవరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడిని పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించిన వనపర్తి సీఐ కృష్ణయ్య, పాన్‌గల్ ఎస్‌ఐ శ్రీనివాసులు, పోలీస్ సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.