
కర్ణాటకకు తరలుతున్న ఎరువుల పట్టివేత
గట్టు: మండల పరిధిలోని బల్గెర చెక్‌పోస్టు వద్ద అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి తరలిస్తున్న ఎరువులను శనివారం మార్కెట్ కమిటీ అధికారులు తనిఖీ చేసి పట్టుకున్నారు. కర్ణాటక రైతులు మల్దకల్ మండలంలోని ఓ ఫర్టిలైజర్ దుకాణంలో 27 యూరియా, 49 కాంపెక్స్ ఎరువుల బస్తాలు కొనుగోలు చేసి వాహనంలో తరలిస్తుండగా పట్టుకుని వ్యవసాయ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి రశీదులను పరిశీలించి తరలింపునకు ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో పోలీసులకు అప్పగించారు.
పిచ్చి కుక్క దాడిలో
పలువురికి గాయాలు
తిమ్మాజిపేట: మండలంలోని పోతిరెడ్డిపల్లిలో శనివారం పిచ్చికుక్క దాడిలో పలువురికి గాయాలయ్యాయని గ్రామస్తులు తెలిపారు. వ్యవసాయ పొలం నుంచి ఇంటికి వస్తున్న పుట్టగళ్ల హన్మంతుపై దాడి చేసి ముఖంపై కరిచింది. అనంతరం ఆంజనేయ ఆలయ సమీపంలో గొర్రెల దొడ్డి వద్ద ఆరుబయట ఉన్న బాలయ్య, ఆయన మనుమరాలిపై దాడి చేయగా.. వారు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే చికిత్స నిమిత్తం తిమ్మాజిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాత్రి పొద్దుపోయే వరకు కుక్క ఆచూకీ దొరకలేదని, ఇంకా ఎంతమందిని కరుస్తుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
చికిత్స పొందుతూ మహిళ మృతి
నాగర్‌కర్నూల్ క్రైం: పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఓ మహిళ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ గోవర్ధన్ శనివారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. తాడూరు మండలం చర్లతిర్మలాపూర్‌కు చెందిన మణెమ్మ (31) భర్త మృతి చెందడంతో పుర పరిధిలోని ఉయ్యాలవాడలో తండ్రి వద్ద ఉండి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. చాలారోజులుగా కడుపునొప్పితో బాధపడుతుండేది. వైద్యం చేయించుకున్నా నయం కాకపోవడంతో మనస్థాపానికి గురై ఈ నెల 17న ఇంట్లో పురుగుమందు తాగింది. గుర్తించిన స్థానికులు ఆమెను వెంటనే చికిత్స నిమిత్తం జనరల్ ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం అటు నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది. తండ్రి బుచ్చన్న ఫిర్యాదు మేరకు శనివారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
వ్యక్తి బలవన్మరణం
కోడేరు: పురుగుమందు తాగి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ జగదీశ్వర్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన ఆది బాలరాజు (40) శుక్రవారం పురుగుమందు తాగాడు. అటుగా వెళ్తున్న వారు చూసి కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు వెంటనే నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. భార్య మధులత గతంలోనే మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
చోరీ నిందితుడి అరెస్టు
అచ్చంపేట రూరల్: ఇళ్లలో చోరీకి పాల్పడుతున్న నిందితుడిని అచ్చంపేట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఎస్‌ఐ విజయభాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల కిందట పట్టణంలో పట్టపగలే ఇళ్లలో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని వ్యక్తి దొంగతనానికి పాల్పడి బంగారు, వెండి, నగదును ఎత్తుకెళ్లాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం గ్రామానికి చెందిన గంగాధర్ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి బంగారు, వెండి, నగదును స్వాధీనం చేసుకున్నారు. శనివారం సాయంత్రం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

కర్ణాటకకు తరలుతున్న ఎరువుల పట్టివేత