
మరణంలోనూ వీడని స్నేహం
మహమ్మదాబాద్: మండలంలోని చౌదర్‌పల్లికి చెందిన కావలి భీమయ్య (55), గోగుల చెన్నయ్య (56) స్నేహితులు. ఇద్దరూ ఈ ప్రాంతంలోని బలభీమరాయ ఆంజనేయ భజన భక్తమండలి సభ్యులుగా ఉంటూ శ్రావణమాసం సందర్భంగా ఆలయంలో నిత్యభజన కార్యక్రమంలో పాల్గొనే వారు. చివరి శనివారం తిరుమలలో అఖండ భజన చేయడానికి అవకాశం రావడంతో 14 మంది భక్తులు తుఫాన్ వాహనంలో గురువారం బయలుదేరారు. మార్గమధ్యంలో భీమయ్యకు గుండెపోటు రావడంతో కోవెలకుంట్లలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో వారంతా మృతదేహంలో వెనుదిరిగి శుక్రవారం ఉదయం 4 గంటల సమయంలో స్వగ్రామానికి చేరుకున్నారు. ఉదయం అంత్యక్రియలకు సామగ్రి తీసుకొచ్చేందుకు చెన్నయ్య బైక్‌పై మహమ్మదాబాద్ వెళ్తూ మార్గమధ్యంలో కమతం రాంరెడ్డి తోట దగ్గర ప్రమాదవశాత్తు రహదారి పక్కనున్న రాతి కడీని ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. ఇద్దరు మిత్రులు ఒకేసారి మృతిచెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భీమయ్య అంత్యక్రియలు పూర్తికాగా.. పోస్టుమార్టం అనంతరం శనివారం చెన్నయ్య అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు గ్రామస్తులు వివరించారు. ఆయా కుటుంబాలను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పరామర్శించారు.
చెన్నయ్య (ఫైల్)
భీమయ్య (ఫైల్)
గుండెపోటుతో ఒకరు..
రోడ్డు ప్రమాదంతో మరొకరు...

మరణంలోనూ వీడని స్నేహం