
శాంతిభద్రతల కోసమే కార్డెన్ సెర్చ్
కొత్తకోట రూరల్: శాంతిభద్రత, నేరాల నియంత్రణను కట్టుదిట్టం చేసేందుకే కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు వనపర్తి డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు అన్నారు. కొత్తకోట సీఐ రాంబాబు, ఎస్‌ఐ ఆనంద్ ఆధ్వర్యంలో శుక్రవారం తెల్లవారు జామున కొత్తకోట పట్టణంలోని విద్యానగర్, శాంతినగర్, ఎన్టీఆర్ కాలనీల్లో 70 మంది పోలీస్ సిబ్బందితో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలు సేకరించడంతో పాటు, సరైన పత్రాలు లేని 50 బైక్‌లు, డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం డీఎస్పీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రజలు గొడవలు, అసాంఘిక చర్యలకు దూరంగా ఉండాలన్నారు. ఇళ్ల యజమానులు తప్పనిసరిగా అద్దెకు ఉంటున్న వారి వివరాలను సేకరించి పోలీసులకు అందజేయాలని సూచించారు. అపరిచితులు, అనుమానాస్పదంగా కాలనీల్లో కనిపిస్తే 100 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. సైబర్ నేరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజల సహకారంతోనే నేరాలను అరికట్టడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆత్మకూర్ సీఐ శివకుమార్, ఎస్‌ఐలు శివకుమార్, రామకృష్ణ, జయన్న, భాస్కర్, ఏఎస్‌ఐలు రోశయ్య, మన్నెపురెడ్డి సిబ్బంది పాల్గొన్నారు.