
విద్యార్థి దశలోనే అవగాహన ఉండాలి
పాలమూరు: విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవడం వల్ల భవిష్యత్‌లో వాటి అవసరాలు ఉపయోగకరంగా ఉంటాయని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర అన్నారు. కోయిలకొండలోని కేజీబీవీ, చింతల్‌తండాలో శుక్రవారం న్యాయ అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన హక్కుల పరిరక్షణ పథకం–2015పై స్థానికులకు అవగాహన కల్పించారు. ఆ తర్వాత బాల కార్మిక చట్టం, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. చిన్నారులు ప్రతి ఒక్కరిని చదివించడానికి తల్లిదండ్రులు ముందుకు రావాలని, విద్య హక్కు చట్టం ప్రాధాన్యతపై చైతన్యం చేశారు. అనంతరం విద్యార్థులకు పోక్సో, బాలల హక్కులు, చట్టాలు, న్యాయ సేవా సంస్థ విధుల గురించి చెప్పారు. కార్యక్రమంలో ఎస్‌ఐ తిరుపాజీ, ఎంఈఓ వెంకట్‌జీ, కేజీబీవీ ప్రత్యేకాధికారి హారిక, పంచాయతీ కార్యదర్శి నరేష్, శివరాం, సత్తయ్య పాల్గొన్నారు.
కోయిల్‌సాగర్ గేట్ల మూసివేత
దేవరకద్ర: కోయిల్‌సాగర్ ప్రాజెక్టు గేట్లను శుక్రవారం ఉదయం నుంచి మూసివేశారు. గురువారం రెండు గేట్లను తెరిచి నీటిని వదిలిన విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టడంతో ఎగువ నుంచి పెద్ద వాగు ప్రవాహం తగ్గిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 32.6 అడుగులు కాగా ప్రస్తుతం 32 అడుగుల వద్ద 2.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
మెప్మా పీడీగా యూసుఫ్
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: మెప్మా పీడీగా నియమితులైన మహమ్మద్ యూసుఫ్ శుక్రవారం ఇక్కడ విధుల్లో చేరారు. హైదరాబాద్‌కి చెందిన ఈయన గతంలో రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం, నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ ప్రత్యేక గ్రేడ్ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేశారు. సుమారు రెండు నెలలుగా వెయిటింగ్ లిస్టులో ఉండగా.. ప్రస్తుతం మహబూబ్‌నగర్‌కు వచ్చారు.
అంతరాష్ట్ర ప్రయాణికులకు రాయితీతో చార్జీలు
స్టేషన్ మహబూబ్‌నగర్: హైదరాబాద్ నుంచి కర్నూలు, తిరుపతి మధ్య ప్రయాణించే వారికి ఆర్టీసీ బస్సుల్లో 15 శాతం రాయితీతో కూడిన చార్జీలు తగ్గించినట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ సంతోష్‌కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి ఆయన కోరారు. హైదరాబాద్–కర్నూలు మధ్య సూపర్ లగ్జరీ పాతచార్జి రూ.450 ఉండగా.. రాయితీతో రూ.390, డీలక్స్ బస్సుకు పాత చార్జి రూ.390 ఉండగా.. రాయితీతో రూ.350, హైదరాబాద్–తిరుపతి మధ్య సూపర్ లగ్జరీ రూ.1,090 కాగా.. రాయితీతో రూ.950 ఉంటుందన్నారు.
ఆగస్టులో రూ.3.50 కోట్ల రుణాలిచ్చాం : డీసీసీబీ
వనపర్తి: జిల్లా కో–ఆపరేటివ్ బ్యాంకు పరిధిలోని ఆరు పీఏసీఎస్‌ల పరిధిలో ఉన్న రైతులకు ఆగస్టులో వివిధ రకాల రుణాలు రూ.3.50 కోట్లు అందజేసినట్లు డీసీసీబీ చైర్మన్ మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని కో–ఆపరేటివ్ బ్యాంకులో పలువురు లబ్ధిదారులకు కర్షకమిత్ర చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగమైన పాడి పశువుల పోషణ, ఇతర వ్యాపారాలకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. రెండు ఎకరాలు అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు కర్షక మిత్ర పథకంలో భాగంగా రుణ చెక్కులను పంపిణీ చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో నాగవరం పీఏసీఎస్ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, రాజనగరం పీఏసీఎస్ చైర్మన్ రఘువర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.