
‘పనుల జాతర’ ముమ్మరం చేయండి
జడ్చర్ల: ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా పనులను ముమ్మరంగా చేపట్టి పూర్తిచేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. శుక్రవారం మండలంలోని పోచమ్మగండతండాలో చేపట్టిన పనుల జాతర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.12 వేలతో నిర్మించే ఇంకుడు గుంత నిర్మాణానికి ఆమె భూమిపూజ చేశారు. అలాగే ఎన్‌ఆర్‌ఈజీఎస్ తదితర నిధుల కింద చేపట్టే వాటిని పనుల జాతరలో పూర్తిచేయాలని, నిర్ణీత లక్ష్యాలను సాధించే దిశగా క్షేత్రస్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే హార్టికల్చర్ కింద సాగు చేసే కొబ్బరి మొక్కలను సంబంధిత రైతుకు అందజేశారు. వంద రోజుల కూలీ పూర్తి చేసుకున్న ఉపాధి హామీ పథకం కూలీ ఎనావత్ రాములుతోపాటు గ్రామ పంచాయతీ కార్మికుడిని కలెక్టర్ శాలువాతో సన్మానించారు. కూలీలు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకు ముందు ఆమె మండలంలోని గంగాపూర్ పీహెచ్‌సీని సందర్శించారు. పారిశుధ్య సమస్యలు ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే జడ్చర– గంగాపూర్ ప్రధాన రహదారిని అనుసరించి జడ్చర్ల మున్సిపాలిటీ చెత్తాచెదారం పారబోయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ అధికారులు పరసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలన్నారు. పారిశుద్ధ్య సమస్యలకు కారణమైన వారిని గుర్తించి నోటీసులు జారీ చేయా లన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి అక్కడికి చేరుకుని చర్యలకు ఉపక్రమించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయ్‌కుమార్, ఏపీఎం సరోజ తదితరులు పాల్గొన్నారు.