
భూనిర్వాసితులకు ఎకరాకు రూ.35 లక్షలివ్వాలి
● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నారాయణపేట: పేట–కొడంగల్‌ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న భూనిర్వాసితులకు ఎకరాకు రూ.35 లక్షలకు తగ్గకుండా పరిహారం ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నా రు. శుక్రవారం నారాయణపేట మండలంలోని పేరపళ్లలో రిజర్వాయర్‌లో మునుగుతున్న పంట పొలాలను ఆయన పరిశీలన చేశారు. భూములు కోల్పోతున్న భూనిర్వాసితులతో మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్నామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తన తన సొంత నియోజకవర్గంలో భూ నిర్వాసితులకు అతి తక్కువ పరిహారం ఇస్తూ అన్యాయం చేయొద్దని హితవు పలికారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలని, బలవంతంగా కాకుండా భూయజమానుల సమ్మతి మేరకే భూములను సేకరించాలని కోరారు. నెల రోజులుగా భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నేటికీ స్పష్టంగా పరిహారాన్ని ప్రకటించకపోవడం ఏమిటని ప్రవ్నించారు. సీపీఎం రాష్ట్ర నాయకులు టి.సాగర్, వెంకట్రాములు మాట్లాడుతూ బహిరంగ మార్కెట్ ధరలకు అనుగుణంగా పరిహారం అందించినప్పుడే భూనిర్వాసితులకు న్యాయం జరుగుతుందన్నారు. భూ నిర్వాసితుల పక్షాన సీపీఎం పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రభుత్వంపై పట్టుదలతో పోరాటం చేస్తుందని చెప్పారు.