
జూరాల ప్రాజెక్టు సందర్శించిన సీఈ
● తెగిన రోప్‌ల ప్రాంతాన్ని పరిశీలించిన వైనం
● కొత్త రోప్‌లను బిగించేందుకు చర్యలు
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టును ఇరిగేషన్ సీఈ నాగేందర్‌రావు సందర్శించారు. గురువారం సాయంత్రం ఆయన పీజేపీ ఎస్‌ఈ రహీముద్దీన్‌తో కలిసి ప్రాజెక్టు వద్దకు చేరుకుని ప్రాజెక్టుకు వస్తున్న వరద వివరాలను తెలుసుకున్నారు. గేట్ల వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. తెగిన క్రస్టు గేట్ల రోప్‌ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పైభాగం నుంచి తెగిన రోప్‌లను పరిశీలించారు. ప్రతి ఐదేళ్లకు ఒక సారి రోప్‌లను మార్చాలని, తెగిన రోప్‌ల స్థానంలో కొత్త రోప్‌లను బిగించాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తున్న నేపథ్యంలో మున్ముందు మరిన్ని గేట్లు ఎత్తే అవకాశం వస్తే ఇబ్బంది పడకుండా ముందు జాగ్రత్తగా రోప్‌లను బిగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఫ్లడ్ కంట్రోల్ రూం వద్దకు చేరుకుని ఎగువ నుంచి ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను తెలుసుకున్నారు. ఇప్పటి వరకు ప్రాజెక్టు నుంచి ఎంత మేర నీటిని దిగువకు విడుదల చేశారనే సమాచారం తెలుసుకున్నారు. వరదల సమయంలో ప్రాజెక్టు వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు. సందర్శకులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం గద్వాలకు వెళ్లిపోయారు. కార్యక్రమంలో గేట్స్ డివిజన్ ఈఈ కెబేర్ అహ్మద్, ఏఈలు, ఏఈలు ఉన్నారు.