
యూరియా ఇవ్వండి సారూ!
–8లో u
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): జిల్లావ్యాప్తంగా రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు సమృద్ధిగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో యూరియా వినియోగం అత్యవసరమైంది. దీంతో జిల్లాకేంద్రంతో పలు మండలాల్లో గురువారం ఎరువుల దుకాణాలు, సొసైటీల వద్ద బారులు తీరారు. పరిమితంగానే యూరియా ఇవ్వడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది మంది రైతులకే యూరియా లభించడంతో నిరాశతో వెనుదిరిగారు. సరిపడా నిల్వలు లేకపోవడంతో రైతులకు ఒకటి.. రెండు బస్తాలు అంటగట్టి వ్యాపారులు చేతులు దులుపుకుంటున్నారు. సరిపడా యూరియా రాలేదని అధికారులు చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో వారం–పది రోజులుగా వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు ఈ సమయంలో యూరియా చల్లాల్సి ఉంటుంది. పంటల పచ్చదనంతో పాటు మొక్కల ఎదుగుదలకు యూరియా అవసరం ఉంది. కానీ ఇందుకు సరిపడా యూరియా నిల్వలను జిల్లాకు తెప్పించడంలో విఫలమయ్యారు.
కేటాయింపు ఎక్కువ.. సరఫరా తక్కువ
జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో ఇప్పటివరకు 2,67,352 ఎకరాల్లో వివిధ పంటలను రైతులు సాగు చేశారు. అందులో వరి 1,30,086 ఎకరాల్లో, పత్తి 78,107 ఎకరాల్లో, మొక్కజొన్న 35,894 ఎకరాల్లో, కంది 9,611 ఎకరాల్లో, జొన్న 13,550 ఎకరాల్లో, మిగతా జొన్న, పెసర ఇతర మెట్ట పంటలను సాగు చేశారు. సీజన్‌లో పత్తి, వరి పంటలకు రైతులు యూరియాను వినియోగిస్తున్నారు. జిల్లాకు ఈ వానాకాల సీజన్‌లో 38,783 మెట్రిక్ టన్నుల యూరియా వినియోగం ఉంటుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అయితే ఇప్పటివరకు 19,634 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం కేటాయించింది. మరో 19,149 మెట్రిక్ టన్నుల యూరియా జిల్లాకు రావాల్సి ఉంది. ఇప్పటివరకు ప్రభుత్వం సరఫరా చేసిన యూరియాను వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలకు, ప్రైవేట్ డీలర్లకు కేటాయించారు. సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలు యూరియాను రైతులు వెంటవెంటనే కొనుగోలు చేస్తుండటంతో అక్కడ నాలుగు.. ఐదు రోజుల్లోనే యూరియా ఖాళీ అయింది.
ఆలస్యమైతే అంతే సంగతి...
యూరియా చల్లడం ఆలస్యమైతే పంట దిగుబడి తగ్గుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అందుకే యూరియా కోసం ఆరాటపడుతున్నారు. కాగా రైతులకు సరైన అవగాహన కల్పించడంలో అధికారుల వైఫల్యం ఉంది. విడతల వారీగా యూరియా వస్తుందని, కృత్రిమ కొరత లేదని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అందుకే వరి పంటకు రెండో దఫా యూరియా వినియోగం కోసం ఇప్పటి నుంచే రైతులు తీసుకెళ్తున్నారు. ఫలితంగా ఈసారి యూరియా అవసరం ఉన్న వారికి నిరాశ తప్పడం లేదు. ఇలాంటి వాళ్లే రోడ్డెక్కుతూ ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుత వర్షాలకు యూరియా చల్లకుంటే పంటలు ఎర్రబారుతాయని, దిగుబడి తగ్గుతుందని ఎవరికి వారే రైతులు భావిస్తున్నారు. ఇందులో నిజనిజాలపై అధికారులు చైతన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జిల్లాకు అవసరమైన యూరియా
38,783 మెట్రిక్ టన్నులు
కేటాయించిన యూరియా
19,634 మెట్రిక్ టన్నులు
అధికారులను వేడుకుంటున్న రైతాంగం
దుకాణాలు, సొసైటీల వద్ద గంటల తరబడి నిరీక్షణ
అయినా దొరకడం లేదంటున్నఅన్నదాతలు
వరుస వర్షాలతో పెరిగిన డిమాండ్
తగినంత అందుబాటులో ఉంచడంలో యంత్రాంగం విఫలం
చేతులెత్తేసిన వ్యాపారులు, అధికారులు

యూరియా ఇవ్వండి సారూ!

యూరియా ఇవ్వండి సారూ!