జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): వానాకాలంలో పండించే వరిధాన్యం సేకరణకు ముందస్తు కార్యాచరణ రూపొందించాలని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ధాన్యం సేకరణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. వ్యవసాయశాఖ సమాచారం మేరకు జిల్లావ్యాప్తంగా 1,71,781 ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారని.. దాదాపు 4.60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందులో 3.60 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం, లక్ష మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలకు 3లక్షల మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. ఈ మేరకు డీఆర్డీఓ ఆధ్వర్యంలో 110, డీసీఓ 79, మెప్మా ఒక కేంద్రంతో కలిపి మొత్తం 190 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం సేకరణకు అవసరమైన గన్నీ బ్యాగులు, మిల్లింగ్ సామర్థ్యం, స్టోరేజ్ తదితర వాటికి పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలని పౌరసరఫరాల శాఖ అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి గంప శ్రీనివాస్, మేనేజర్ రవినాయక్, జిల్లా సహకార అధికారి శంకరాచారి, మార్కెటింగ్ అధికారిణి బాలమణి, అడిషనల్ డీఆర్డీఓ శారద, వ్యవసాయశాఖ ఏడీ హైమావతి ఉన్నారు.
చట్టాలను సద్వినియోగం చేసుకోవాలి
జడ్చర్ల/జడ్చర్ల టౌన్: వృద్ధుల కోసం రూపొందించిన చట్టాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి ఇందిర సూచించారు. గురువారం జడ్చర్లలోని సీనియర్ సిటిజన్స్ ఫోరం కార్యాలయంలో నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. వృద్ధ తల్లిదండ్రులను అన్యాయానికి గురిచేసే వారి పై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ఆస్తులను పిల్లల పేరున రిజిస్ట్రేషన్ చేసే సమయంలో తమ తదనంతరం అని పొందుపర్చాలని.. తద్వారా ఆస్తికోసమైన పిల్లలు తల్లిదండ్రుల బాగోగులు చూసుకుంటారని తెలిపారు.
వృద్ధులకు న్యాయ సలహాలు అవసరమైతే తమను సంప్రదించాలని సూచించారు. జడ్చర్ల సీనియర్ సిటిజన్స్ ఫోరం చేస్తున్న కార్యక్రమాలను న్యాయమూర్తి ప్రశంసిస్తూ.. పలువురిని శాలువాలతో సత్కరించారు. అనంతరం రూరల్ సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ వృద్ధాశ్రమాన్ని న్యాయమూర్తి సందర్శించి వృద్ధులకు కల్పిస్తున్న వసతులను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమశాఖ అధికారిణి జరీనాబేగం, ఫోరం అధ్యక్షుడు నయీమొద్దీన్, సభ్యులు శంకర్‌బాబు, ప్రకాశ్, వేణుగోపాల్, ఆశ్రమ నిర్వాహకుడు సంజీవ్ గుప్తా, తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం సేకరణకుముందస్తు కార్యాచరణ