
రాకున్నా.. వచ్చినట్లే
గ్రామ పంచాయతీకార్యదర్శుల లీలలు ఎన్నో
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): సాంకేతిక లోపాలను అలుసుగా తీసుకున్న గ్రామ పంచాయతీ కార్యదర్శులు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారు. కొందరు ఎక్కడో ఉండి యాప్‌లో హాజరు నమోదు చేసుకుంటుండగా.. మరికొందరు తమ స్థానంలో మరొకరితో అటెండెన్స్ కోసం సెల్ఫీ ఫొటో తీయిస్తున్నారు. జిల్లాలో ఇలా విధుల పట్ల 11 మంది కార్యదర్శులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు డీపీఓ అధికారులు గుర్తించి.. కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు పాలకవర్గాలు లేకపోవడంతో అన్నీ తామై వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శులు ఇలా ఫేస్ రికగ్నిషన్ యాప్‌లో ఇతర వ్యక్తులతో అటెండెన్స్ నమోదు చేయించడం చర్చనీయాంశమైంది.
ఎక్కడెక్కడ అంటే..
జిల్లావ్యాప్తంగా 11 మంది పంచాయతీ కార్యదర్శులు తప్పుడు అటెండెన్స్ వేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు సదరు 11 మందిపై అధికారులు నివేదిక తయారు చేశారు. గండేడ్ మండలంలో ఓ ఔట్‌సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శి, కౌకుంట్ల మండలంలోని ఔట్ సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శి, కోయిలకొండ మండలంలో ఇద్దరు, అడ్డాకుల, నవాబ్‌పేటలో ఒక్కొక్కరు, దేవరకద్ర మండలంలో ఇద్దరు, జడ్చర్ల, మూసాపేట్, మిడ్జిల్ మండలాల్లో ఒక్కొక్కరు ఉన్నారు. వీరిలో ఒకరు ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోతో డీఎస్‌ఆర్ యాప్‌లో అటెండెన్స్ నమోదు చేస్తున్నట్లు తేలింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం అన్ని జిల్లాల్లో యాప్‌లో నమోదైన పంచాయతీ కార్యదర్శుల ఫొటోలను పరిశీలించాలని ఆదేశించింది. ఈ మేరకు పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ విజయేందిర డీపీఓ అధికారులకు సూచించడంతో నకిలీ హాజరు నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సర్వీసు నుంచి రిమూవ్ చేయాలని, నలుగురిని సస్పెండ్ చేయగా, మరో ఐదుగురికి చార్జీ మెమోలు జారీచేశారు.
చర్యలు తీసుకున్నాం..
ఫేస్ అటెండెన్స్ యాప్‌లో టెక్నికల్ సమస్యలను ఆసరాగా చేసుకుని ఇతరులతో అటెండెన్స్ వేసిన వారిపై చర్యలు తీసుకున్నాం. ఇది జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగానూ ఇలాగే చేశారు. జిల్లాలో నలుగురిని సస్పెండ్ చేయడంతోపాటు ఐదుగురికి ఏఓసీ మెమో, ఇద్దరు ఓపీఎస్‌ను తొలగించడం జరిగింది.
– పార్థసారధి, డీపీఓ
కొందరు విధులకు రాకుండానే హాజరు నమోదు
వరంగా మారిన సాంకేతిక లోపం
తాజాగా 11 మంది కార్యదర్శులపై చర్యలు