మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూ పరిధిలోని బీఫార్మసీ సెమిస్టర్–8 రెగ్యులర్, 1, 3, 5, 7 సెమిస్టర్లకు సంబంధించి బ్యాక్‌లాగ్ పరీక్షల ఫలితాలను వీసీ శ్రీనివాస్ బుధవారం విడుదల చేశారు. ఈ మేరకు 8వ సెమిస్టర్‌లో 82.74 శాతం, 7వ సెమిస్టర్‌లో 71.43 శాతం, 5వ సెమిస్టర్‌లో 50 శాతం, 3వ సెమిస్టర్‌లో 54.55 శాతం, 1వ సెమిస్టర్‌లో 58.33 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్‌బాబు, కంట్రోలర్ ప్రవీణ, అడిషనల్ కంట్రోలర్ శాంతిప్రియ, ప్రిన్సిపాల్ రవికాంత్, ఈశ్వర్‌కుమార్, సురేష్, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైనవైద్యం అందించాలి
రాజాపూర్: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అదనపు కలెక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి అన్నారు. బుధవారం రాజాపూర్‌లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని లేబర్‌రూంతోపాటు పరిసరాలను పరిశీలించారు. ప్రతినెలా ఎన్ని కాన్పులు అవుతున్నాయి.. మేజర్ కేసులు ఎలా చేస్తున్నారు అని మండల వైద్యాధికారి సుశ్మితను అడగగా.. ప్రతినెలా 8 నుంచి 10 వరకు కాన్పులు అవుతున్నామని చెప్పారు.
ముఖ్యంగా జాతీయ రహదారిపై ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం రాజాపూర్ శివారులో ఉన్న కేజీబీవీని సందర్శించి స్టోర్ రూంను పరిశీలించారు. విద్యార్థులకు మెరుగైన విద్యతోపాటు నాణ్యమైన భోజనం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్ లక్ష్మిబాయిని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: నగర పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ కమినర్ ప్రవీణ్‌కుమార్ రెడ్డి సూచించారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో మొదటిసారి ధరల నియంత్రణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ సామగ్రిని కనీస ధరకు విక్రయించేలా వ్యాపారులను ఒప్పించాలన్నారు. ముఖ్యంగా కూలీల వేతనం రోజుకు రూ.250 నుంచి రూ.300 వరకు చెల్లించాలన్నారు.
ఇసుకను రీచ్‌ల నుంచి తెప్పించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. వీలైనంత తొందరగా లబ్ధిదారులు ఈ ఇళ్లను పూర్తి చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఏఎంసీ అజ్మీరా రాజన్న, హౌసింగ్ డీఈఈ విజయ్, ఆర్‌ఓ మహమ్మద్ ఖాజా, మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ ఘాన్సీరాం, ఆర్‌ఐలు టి.నర్సింహ, రమేష్, ముజీబుద్దీన్, అహ్మద్‌షరీఫ్‌తో పాటు వార్డు ఆఫీసర్లు పాల్గొన్నారు.