
అమ్మాయిల రక్షణకు అధిక ప్రాధాన్యం
మహబూబ్‌నగర్ క్రైం: అమ్మాయిలు, మహిళల రక్షణ అంశంలో భరోసా సెంటర్ల ప్రాధాన్యత అధికంగా ఉండాలని, బలహీన వర్గాల రక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఇందిర అన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన భరోసా కన్వర్జెన్సీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సమాజంలో జరిగే హింసాత్మక ఘటనల నివారణ, బాధితులకు న్యాయం అందించడంలో పోలీస్ శాఖ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మహిళా, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రతి కేసు పరిష్కారంలో మానవతా దృక్పథం అత్యంత ముఖ్యమని, బాధితులు భయపడకుండా ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలన్నారు. చిన్నారులపై లైంగిక దాడులు, మహిళలపై వేధింపులు, గృహహింస వంటి సమస్యలను ఎదుర్కొనేందుకు చట్టపరమైన సహాయం, కౌన్సెలింగ్, పునరావాసం ఒకే వేదికపై అందించబడితే సమాజం మరింత బలపడుతుందన్నారు. సమావేశంలో ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, డీడబ్ల్యూఓ జరీనా, డీఎంహెచ్‌ఓ కృష్ణ, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఎస్పీ శ్రీధర్, డీఎస్పీలు వెంకటేశ్వర్లు, రమణారెడ్డి, పీపీలు, సీఐలు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.