
స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు స్వల్ప గాయాలు
నాగర్‌కర్నూల్ క్రైం: ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి ఓ ప్రైవేటు పాఠశాల బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటన మండలంలోని గన్యాగుల గ్రామ శివారులో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పెద్దకొత్తపల్లిలోని ఆల్ సెయింట్స్ మోడల్ స్కూల్‌కు చెందిన పాఠశాల బస్సు నాగపూర్, రాయిపాకుల గ్రామాల్లోని విద్యార్థులను ఎక్కించుకొని పాఠశాలకు వెళుతుండగా గన్యాగుల శివారులో మూలమలుపు వద్ద ద్విచక్రవాహనం అడ్డురావడంతో దానిని తప్పించబోయి బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. అక్కడే వరి నాట్లు వేస్తున్న కూలీలు అప్రమత్తమై బస్సులో నుంచి పాఠశాల విద్యార్దులను బయటకు తీశారు. బస్సులో మొత్తం 20 మంది విద్యార్థులు ఉండగా కొందరికి స్వల్పగాయాలయ్యాయి. ఎవరికీ ఎలాంటి హానీ కలగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం విద్యార్థులను ఆటోల్లో ఇంటికి పంపించారు. సంఘటనకు సంబంధించి ఎస్‌ఐ గోవర్ధన్‌ను వివరణ కోరగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.