
చిరుత సంచారంపై పరిశీలన
మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లాకేంద్రం సమీపంలోని తిర్మల్‌దేవునిగుట్ట, శ్మశానవాటిక ప్రాంతాల్లో కొంతకాలంగా సంచరిస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్న చిరుత ఈ నెల 11న తెల్లవారుజామున ట్రాప్ కెమెరాకు చిక్కిన ప్రదేశాన్ని సోమవారం సాయంత్రం జిల్లా అటవీ శాఖాధికారి సత్యనారాయణ పరిశీలించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన ట్రాప్ సీసీ కెమెరాకు గతంలోనూ కనిపించడంతో చిరుతను పట్టుకునే సాధ్యాసాధ్యాలపై సిబ్బందితో చర్చించి సూచనలు చేశారు. చుట్టుపక్కల మరిన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు బోను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పరిసర ప్రాంతాల ప్రజలు చిరుత సంచారం పట్ల అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని కోరారు.