
అప్పుల రాష్ట్రంగా మార్చారు
● ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తాం
● రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
అచ్చంపేట/బల్మూర్: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చిందని.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్‌రెడ్డి ఓవైపు ప్రజాసంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలుచేస్తూనే, మరోవైపు అప్పులు తిరిగి చెల్లిస్తున్నారని రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. సోమవారం అచ్చంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యేలు డా.చిక్కుడు వంశీకృష్ణ, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, కలెక్టర్ బదావత్ సంతోష్‌తో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతోందన్నారు. అర్హులైన పేదలకు కొత్త రేషన్‌కార్డులు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజా సంక్షేమం, గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ఆర్థిక సంక్షోభం నెలకొన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తున్నామన్నారు. రాష్ట్రంలో పండించిన సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వడమే కాకుండా.. రేషన్ దుకాణాల్లో పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అచ్చంపేట అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. టీయూఎఫ్‌డీసీ నుంచి మరో రూ. 16కోట్ల నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ప్రజలకు మేలుచేసే విధంగా ప్రతి అధికారి పనిచేయాలని సూచించారు.
● బల్మూర్ మండలం కొండనాగులలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని మంత్రి వివేక్ వెంకటస్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. బాబా సాహెబ్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా విద్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ గార్లపాడు శ్రీనివాసులు, కమిషనర్ మురళి, ఆర్డీఓ మాధవి, తహసీల్థార్ సైదులు, జిల్లా గ్రంథాయాల సంస్థ చైర్మన్ జి.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.