
కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో కొత్త స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. సోమావారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో నూతన స్వయం సహాయక సంఘాల ఏర్పాటుపై శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మహిళా, వృద్ధ, దివ్యాంగ, కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేసి, వీటిలో పేదవారిని చేర్చించాలన్నారు. అలాగే 60 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులు, కిశోర బాలికలను గుర్తించి సంఘాలలో చేరేలా ప్రోత్సహించాలన్నారు. వారితో బ్యాంకు ఖాతాలు, తెరిపించాలని, ఇందులో ఏమైనా సమస్యలు ఎదురైతే ఏపీఎంల సహకారం తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ఈ నెలాఖరు వరకు పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో సెర్ప్ అధికారి వసంతసేనా, డీఆర్‌ఈఓ నర్సింహులు, ఏపీడీ శారద, డీపీఎంలు లక్ష్మయ్య, అరుణదేవి, రామునాయక్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజావాణికి 76 ఫిర్యాదులు
ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్‌లోని మీటింగ్‌హాల్‌లో ప్రజల నుంచి 76 ఫిర్యాదులు స్వీకరించారు. అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శివేంద్రప్రతాప్, నర్సింహారెడ్డి, జెడ్పీసీఈఓ వెంకట్‌రెడ్డి, ఆర్డీఓ నవీన్, హౌజింగ్ పీడీ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.