
నాణ్యతకు తిలోదకాలు!
పాతపాలమూరులోని
శ్రీ శివరామాంజనేయ ఆలయం ఎదురు వీధిలో ఎస్సీకాలనీ నుంచి రైసా మసీదు వరకు యూడీజీ కోసం ఏడాది క్రితం శంకుస్థాపన చేశారు. ఈ పనుల కోసం రూ.పది లక్షలు కేటాయించారు. అయితే కాంట్రాక్టర్ కొన్ని రోజుల క్రితమే పాత మురుగు కాల్వలోనే పనులు ఆరంభించారు. మధ్యలో ఉన్న నలుకూడలిలో మిషన్ భగీరథ పథకం పైపులైన్ అడ్డం వచ్చింది. ఈ పనులు పూర్తి కాకముందే ఈ ప్రాంతంలో రెండు, మూడు చోట్ల సిమెంట్ పైపులు పగిలిపోయాయి. నాసిరకమైనవి వినియోగించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఇదే మార్గంలో తాగునీటి కోసం పీవీపీ పైపులైన్ వేశారు. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ బీటీ రోడ్డంతా ధ్వంసమైంది. ఇటీవల వరుసగా కురిసిన వర్షాలకు మొత్తం బురదమయంగా మారింది. వాహనాల రాకపోకలకు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
స్థానిక ఏనుగొండలోని సాంబ శివాలయం దేవునిగుట్టపై సీసీ రోడ్డు వెంట
15 రోజుల క్రితమే వంద మీటర్ల మేర యూజీడీ నిర్మించారు. ఇక్కడ కనీస ప్రమాణాలు పాటించకుండా మ్యాన్‌హోళ్ల వద్ద అటు, ఇటు సిమెంటు పైపులను ఒకదానికొకటి కలిపేసి వాటికి పెద్ద రంధ్రాలు పెట్టి వదిలేశారు. వాస్తవానికి ఈ పైపుల మధ్య కొంత ఖాళీ స్థలం వదిలి చుట్టూ ఇటుకలు, సిమెంట్‌తో కలిపి మ్యాన్‌హోళ్లను ఏర్పాటు చేయాలి. అలాగే ఇళ్ల నుంచి బయటకు వచ్చే పైపుల కంటే పైకి ఎత్తుగా వీటిని నిర్మించడంతో వరదతో పాటు మురుగు కాస్తా ఇళ్ల లోపలికి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. ఇలా అస్తవ్యస్తంగా యూజీడీని సుమారు పది ఇళ్ల వరకు వేశారు. దీంతో పై నుంచి మురుగుతో పాటు వర్షాకాలంలో వరద మొత్తం ఇళ్లలోకి వచ్చేలా ఉంది. ఇదంతా చూస్తుంటే.. జనాల అవసరాల కోసం కాకుండా బిల్లుల కోసమే వీటిని నిర్మించినట్లు తేటతెల్లమవుతోంది.
విఘ్నేశ్వరకాలనీలో ఇటీవల రెండు చోట్ల మొత్తం 300 మీటర్ల యూడీజీ నిర్మించారు. దీనికి ఒక ఫీటు సైజు సిమెంటు పైపులు వాడారు. అయితే పై నుంచి వచ్చే వరద ఉద్ధృతితో పాటు మురుగు ధాటికి
తట్టుకోవని స్థానికులు వాపోతున్నారు. వీటి స్థానంలో పెద్ద పైపులు వేసి ఎలైన్‌మైంట్ మార్చాలని కోరుతున్నారు. మరికొన్ని వీధుల్లోనూ విస్తరించి వీటికి కలిపితే సమస్య పరిష్కారమవుతుందని వారు
చెబుతున్నారు.
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: కార్పొరేషన్ పరిధిలోని వివిధ కాలనీలలో ఏడాది కాలంగా చేపట్టిన అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) పనుల్లో నాణ్యత లోపించింది. ఈ టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించి నాసిరకం పైపులను తమకు తోచిన విధంగా వేస్తుండటంతో కొన్నిచోట్ల పగిలిపోతున్నాయి. వాస్తవానికి నగరంలోని చాలా ప్రాంతాలు ఎత్తు పల్లాలతో ఎగుడుదిగుడుగా ఉన్నాయి. అసలే వర్షాకాలం కావడంతో వరదతో పాటు మురుగు ముందుకు కదలడం లేదు. అంతటా ఫీటు మేర సైజు కలిగిన పైపులనే వాడటం.. ఆపై సరైన పద్ధతిలో మ్యాన్‌హోళ్లను ఏర్పాటు చేయకపోవడంతో పైనుంచి వచ్చే వరదకు అవి తట్టుకునే పరిస్థితులు లేవు. ముఖ్యంగా మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో యూజీడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. గతేడాది ఆగస్టు నుంచి ఈ ఏడాది జూలై వరకు నగరంలోని దాదాపు అన్ని డివిజన్ల పరిధిలో 54 చోట్ల సుమారు ఆరు వేల మీటర్ల యూజీడీ పైపులైన్ వేయాలని నిర్ణయించారు. దీని కోసం రూ.4,96,69,000 కేటాయించారు. ఇందులో ఇప్పటివరకు 50 శాతం మేర పనులు పూర్తి కాగా, మిగతావి ఇంకా పురోగతిలోనే ఉండటం గమనార్హం.
నడవడానికి ఇబ్బందులు
మా ప్రాంతంలో నెల రోజులుగా యూజీడీ పనులు కొనసాగుతున్నాయి. రోడ్డుకు ఒకపక్క మిషన్ భగీరథ పథకం, మరోపక్క యూజీడీ పనులతో బీటీ రోడ్డు మొత్తం ధ్వంసమైంది. వర్షం కురిసినప్పుడు బురదమయంగా మారుతోంది. కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది. సిమెంట్ పైపులు పాతకాల్వలో అస్తవ్యస్తంగా వేయడంతో మురుగు ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది. ఈ పనులు త్వరగా పూర్తి చేసి కొత్త సీసీరోడ్డు నిర్మించాలి.
– భారతమ్మ, గృహిణి,
పాతపాలమూరు, మహబూబ్‌నగర్
బయటి మురుగు ఇంట్లోకి వచ్చేలా ఉంది
ఈ ప్రాంతంలో ఇటీవల అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పైపులైన్ సరిగా వేయకపోవడం వల్ల బయట నుంచి మురుగు, వరద నీరు ఇంట్లోకి వచ్చేలా ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ ఈ పైపులైన్‌ను తూతూమంత్రంగా వేసి వెళ్లారు. ఇక్కడి సుమారు పది ఇళ్లకు సంబంధించి బయటకు వెళ్లే పైపుల కన్నా యూడీజీ పైపులైన్ పైకి ఎత్తుగా ఉంది. దీనిని వెంటనే సరి చేయించాలి.
– నాగరాజు, దేవునిగుట్ట,
సాంబ శివాలయం ప్రాంతం, ఏనుగొండ
పరిశీలించి చర్యలు తీసుకుంటాం..
నగరంలోని వివిధ డివిజన్ల పరిధిలో నిర్మిస్తున్న అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ పనులను త్వరలో మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం. ఎక్కడైనా నాసిరకం పనులు ఉన్నట్లు తేలితే సంబంధిత కాంట్రాక్టర్లపై తగు చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారిని వదిలిపెట్టేది లేదు. పాత పాలమూరులో పగిలిపోయిన సిమెంట్ పైపులను తొలగించి కొత్తవి వేయిస్తాం. – టి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మహబూబ్‌నగర్
నగరంలో యూజీడీ వ్యవస్థ అస్తవ్యస్తం
నాసిరకం పనులతో
ధ్వంసమవుతున్న పైపులు
ఆయా పనుల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం
కొరవడిన మున్సిపల్ అధికారుల
పర్యవేక్షణ
అసలే వర్షాకాలం..
ఆపై ముందుకు పారని మురుగు