‘నులి’పేస్తోంది..! | - | Sakshi
Sakshi News home page

‘నులి’పేస్తోంది..!

Aug 11 2025 1:15 PM | Updated on Aug 11 2025 1:15 PM

‘నులి’పేస్తోంది..!

‘నులి’పేస్తోంది..!

ఆ చిన్నారులకు ఇవ్వొద్దు..

పాలమూరు: కడుపులో నులిపురుగులతో పిల్లలు అనేక అనారోగ్య సమస్యలతో సతమతం అవుతుంటారు. వారి శారీరక, మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో నులిపురుగులను నివారించడమే లక్ష్యంగా జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు సోమవారం జిల్లావ్యాప్తంగా 13 మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లోని 1 నుంచి 19 ఏళ్లలోపు ఉండే చిన్నారులు, యువతీ, యువకులకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేయనున్నారు.

సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీకి ఇప్పటికే వైద్య ఆరోగ్య సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల హెచ్‌ఎంలు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. మాత్రలను సబ్‌సెంటర్లు, ఏఎన్‌ఎం, ఆశాలకు అందజేశారు. వెద్య, ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 1 నుంచి 19 ఏళ్ల మధ్య వయసు గలవారు 2.54 లక్షల బాల, బాలికలు ఉన్నారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే సుమారు లక్ష మంది వరకు రక్తహినత, పోషకాహార లోపంతోపాటు ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. రక్తహీనత ఉన్నవారిలో ఆకలి లేకపోవడం, బలహీనంగా, నీరసంగా, ఆందోళన ఉండటం లాంటి సమస్యలు వస్తాయి. తరచూ కడుపునొప్పి వస్తుంది. వికారంగా ఉడటంతోపాటు విరేచనాలు, మలంలో రక్తం రావడం జరుగుతుంది.

సమస్యలు.. జాగ్రత్తలు

నులిపురుగులతో బాధపడేవారు ప్రధానంగా ఎనిమియా (రక్తహీనత) వ్యాధి బారినపడతారు. శరీరంలో పదేపదే నీరసం వస్తూ నీరసించిపోతారు. శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ఆకలి మందగించి జీర్ణ సంబంధ సమస్యలు తలెత్తుతాయి. పిల్లలు మందబుద్ధిగా తయారవుతారు. మలవిసర్జన ప్రదేశంలో, చర్మంపై దురదలు వస్తుంటాయి. కొందరు పిల్లల్లో దీర్ఘకాలంపాటు ఇవి ఉన్నప్పటికి వ్యాధి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ, ఈ సమస్య వారి ఆరోగ్యం, విద్య ఇలా అన్ని రకాల ఎదుగుదలపై ప్రభావితం చూపుతాయి. నులిపురుగుల ఎక్కువగా ఉంటే ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది. మల విసర్జన, బహిర్భూమికి వెళ్లివచ్చాక కాళ్లు, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాదాలకు బూట్లు తప్పనిసరిగా ధరించాలి. దీంతోపాటు ఆహార పదార్థాలను శుభ్రంగా కడగాలి. ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం వల్ల నులిపురుగులు రాకుండా నియంత్రించవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లలకు, యువకులకు తప్పనిసరిగా ఆల్బెండజోల్‌ మాత్రలు వేయించాలని వైద్యాధికారులు చెబుతున్నారు. దీంతో సంక్రమణాన్ని నియంత్రించడంతోపాటు శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడుతుందని సూచిస్తున్నారు. అయితే రెండేళ్లలోపు పిల్లలకు సగం మాత్రలు, 3–19 ఏళ్ల వారికి ఒక మాత్ర వేయాలని వైద్యులు చెబుతున్నారు. మాత్రలు వేసే సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని పేర్కొంటున్నారు. వైద్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రమే వేయాలని సూచిస్తున్నారు. కాగా.. జిల్లాలో దాదాపు 70 శాతం కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు లేకపోవడంతో నులిపురుగుల వ్యాప్తి పెరిగిపోతుంది.

జిల్లాలో నులి పురుగుల నివారణ కోసం 1–19 ఏళ్ల బాల, బాలికలకు ఇచ్చే ఆల్బెండజోల్‌ ట్యాబ్‌లెట్స్‌ పంపిణీ చేయాడానికి ఏర్పాట్లు చేశాం. నేడు తప్పిపోయిన విద్యార్థులకు ఈ నెల 18న మాప్‌ఆప్‌ కింద పంపిణీ చేస్తాం. అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలో బడి బయట చిన్నారులు కలిపి జిల్లాలో 2,54,000 మంది ఉండగా వీరందరికీ మాత్రలు ఇవ్వడానికి సిద్ధం చేశాం. ఆహారం తీసుకున్న తర్వాత ట్యాబ్‌లెట్‌ ఇవ్వాలి. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న చిన్నారులకు ఇవ్వరాదు.

– కృష్ణ, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి

2,83,700

జిల్లాలో 70 శాతానికిపైగానే నులి పురుగుల బాధితులు

2.54 లక్షల మంది బాల,

బాలికలను గుర్తించిన వైద్యాధికారులు

వీరికి 2.83 లక్షల ఆల్బెండజోల్‌ మాత్రల పంపిణీకి సిద్ధం

ఏర్పాట్లు పూర్తిచేసిన

వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు

నేడు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement