
విద్యార్థుల ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించొద్దు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దని కలెక్టర్ విజయేందిర అన్నారు. ఆదివారం గిరిజన సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి.. మధ్యాహ్నం విద్యార్థుల కోసం వండిన ఆహారాన్ని పరిశీలించారు. మెనూ గురించి విద్యార్థినులను అడగగా.. ఆదివారం బగారా అన్నం, చికెన్ పెడుతున్నట్లు చెప్పారు. వంట గదిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. భోజనం చేయడానికి వచ్చిన విద్యార్థులతో మాట్లాడి మౌలిక వసతులు, ఆహారం ఎలా ఉంది అని ఆరా తీశారు. ఎలా చదువుతున్నారు.. డిగ్రీ తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారని విద్యార్థులను అడిగారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకుని తమ భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని ఆకాంక్షించారు. చదువు ద్వారానే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని, పోటీ ప్రపంచంలో బాగా చదివిన వారికి మాత్రమే గుర్తింపు ఉంటుందని చెప్పారు.
విద్యార్థులతో మాట్లాడుతున్న కలెక్టర్ విజయేందిర