
‘ఓట్లు అడిగే హక్కు బీజేపీకే ఉంది’
జడ్చర్ల టౌన్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు దగ్గరగా ఉన్నవారికే విజయం వరిస్తుందని, అందుకోసం బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు చేరువగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి పాటుపడాలని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం జడ్చర్లలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఓట్లు అడిగే హక్కు కేవలం బీజేపీకి మాత్రమే ఉందన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ అనేక హామీలిచ్చి నెరవేర్చలేదని, కేంద్రం నిధులు కేటాయించిన గ్రామాలకు ఇవ్వకుండా ఇబ్బందులు చేసిందని ఆరోపించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పంచాయతీలకు పూర్తిస్థాయిలో నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి మొత్తం కేంద్రం నిధులతోనే జరిగిందని ప్రజలకు వివరించాలన్నారు. నియోజకవర్గంలోని అన్ని జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచించారు. పార్లమెంట్ ఇన్‌చార్జి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేస్తుందన్నారు. కేంద్రం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని చెప్పారు. సమావేశంలో జాతీయ కౌన్సిలర్ సభ్యురాలు పద్మజారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కృష్ణయ్య, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బాలవర్ధన్‌గౌడ్, అమర్‌నాథ్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, నర్సింహులు, నవీన్, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.