
‘బీజేపీ కనుసన్నల్లోనే స్వతంత్ర వ్యవస్థలు’
స్టేషన్ మహబూబ్‌నగర్: బీజేపీ కనుసన్నల్లోనే దేశంలోని స్వతంత్ర వ్యవస్థలు నడుస్తున్నాయని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. డిజిటల్ ఓటర్ లిస్టు, సీసీ పుటేజ్‌లు ఇవ్వాలని రాహుల్‌గాంధీ కోరుతున్నా ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. అధికారం కోసం బీజేపీ వ్యవస్థలను వాడుకొని తప్పిదాలు చేసిందని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును దొంగతనానికి పాల్పడటం దుర్మార్గమని అన్నారు. అంతకుముందు ప్రొజెక్టర్ ద్వారా రాహుల్‌గాంధీ ప్రజెంటేషన్‌ను ఎమ్మెల్యే, ఇతర నాయకులు తిలకించారు. సమావేశంలో రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్,, నాయకులు వినోద్‌కుమార్, ఎన్‌పీ వెంకటేశ్, సిరాజ్‌ఖాద్రీ, సీజే బెనహర్, జహీర్ అఖ్తర్ తదితరులు పాల్గొన్నారు.