
పాలమూరుకు సాగునీరు
● కొండాపూర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు
● మనికొండ మీదుగా 25 చెరువులను నీటితో నింపేందుకు చర్యలు
● జిల్లా రైతులకు తీరనున్న సాగునీటి కష్టాలు
మహబూబ్‌నగర్ ప్రజల నీటి కష్టాలు తీర్చనున్న కోయిల్‌సాగర్
ఒకప్పుడు నీటి ఎద్దడితో అల్లాడుతున్న మహబూబ్‌నగర్ నియోజకవర్గ ప్రజలకు తాగునీరు అందించిన కోయిల్‌సాగర్ ప్రాజెక్టు.. ఇప్పుడు సాగునీటి అవసరాలు సైతం తీర్చనుంది. కొండాపూర్ వద్ద కొత్తగా లిఫ్ట్ ఏర్పాటు చేసి కోయిల్‌సాగర్ నుంచి నీటిని ఎత్తిపోయనున్నారు. మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని 25 చెరువులను నీటితో నింపి వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో పనులు షరవేగంగా కొనసాగుతున్నాయి.
మహబూబ్‌నగర్ రూరల్: జిల్లాలోని భారీ నీటిపారుదల ప్రాజెక్టు కోయిల్‌సాగర్ నుంచి పాలమూరుకు సాగునీరు అందబోతుంది. ఇందుకు సర్వే కూడా దాదాపు పూర్తయింది. కోయిల్‌సాగర్ నుంచి కొండాపూర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి కేశ్వాపూర్, మనికొండ మీదుగా మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని 25 చెరువులను నీటితో నింపనున్నారు. ఈ పనులు పూర్తయితే రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి.
5వేల ఎకరాలకు..
జిల్లాలో ఏకై క సాగునీటి వనరు అయిన కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు సాగునీరు అందించే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి పెద్దగా సాగునీటి ప్రాజెక్టులు లేవు. దీంతో కోయిల్‌సాగర్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి రూరల్ మండలానికి అందించవచ్చనే ఉద్దేశంతో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఈ మేరకు ప్రతిపాదించారు. కోయిల్‌సాగర్ రిజర్వాయర్ దేవరకద్ర నియోజకవర్గ పరిధిలో ఉంది. ఈ రిజర్వాయర్ కింద లిఫ్ట్ ద్వారా మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని 25 చెరువులను నింపి వాటి పరిధిలో 5వేల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ప్రతిపాదనలకు మంత్రి సానుకూలంగా స్పందించి ఆ దిశగా పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. జూరాల బ్యాక్ వాటర్‌తో రన్ అవుతున్న కోయిల్‌సాగర్ రిజర్వాయర్ ద్వారా కొత్తగా లిఫ్ట్ ఏర్పాటు చేసి సమీప చెరువులను నింపి సాగునీరు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి ఇరిగేషన్ అధికారులు చెరువుల గుర్తింపు పనిలో నిమగ్నమై సర్వే చేస్తున్నారు.
కొండాపూర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటు
ఒకప్పుడు నీటి ఎద్దడితో అల్లాడుతున్న మహబూబ్‌నగర్ నియోజకవర్గానికి తాగునీటి అవసరం తీర్చిన కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ఇప్పుడు సాగునీటి అవసరాలు తీర్చనుంది. కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా కొండాపూర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి రూరల్ మండలంలోని 25 చెరువులకు సాగునీరు పారించనున్నారు. చౌదర్‌పల్లి, బొక్కలోనిపల్లి, మనికొండ, రామచంద్రాపూర్, మాచన్‌పల్లి, కోటకదిర, పోతన్‌పల్లి, దేవరకద్ర మండలంలోని వెంకటాయపల్లి గ్రామాల చెరువులను కోయిల్‌సాగర్ బ్యాక్ వాటర్‌తో నింపనున్నారు. ఎనిమిది గ్రామాలను కలుపుతూ ఈ చెరువులు ఉండటంతో దాదాపు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. దీంతో యాసంగి పంటలకు సాగునీటి ఇబ్బందులు తప్పే అవకాశం ఉంది.
పాలమూరు– రంగారెడ్డి ద్వారా..
దీంతోపాటు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాకు సాగునీరు అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కర్వెన రిజర్వాయర్ కింద మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో 9,750 ఎకరాలు, హన్వాడ మండలంలోని 14,852 ఎకరాలకు సాగునీరు అందించే ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. కర్వెన కెనాల్ ద్వారా మహబూబ్‌నగర్ రూరల్ మండలానికి, ఉదండాపూర్ రిజర్వాయర్ ద్వారా హన్వాడ మండలానికి సాగునీరు అందించనున్నారు.
ప్రభుత్వానికి ప్రతిపాదనలు..
కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్‌నగర్ రూరల్ మండలంలోని పొలాలకు సాగునీరు అందిస్తాం. సుమారు 25 చెరువులను నింపి ఐదువేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి సంకల్పించారు. ఆ మేరకు సర్వే కూడా పూర్తయింది. మరో పది రోజుల్లో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నారు. ఈ పనులు పూర్తయితే మండల రైతులకు సాగునీటి కష్టాలు తీరనున్నాయి. – మల్లు నర్సింహారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
సర్వే పూర్తయింది
కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా మహబూబ్‌నగర్ రూరల్ మండలంలో సుమారు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే ప్రతిపాదనల మేరకు సర్వే చేయించాం. కొండాపూర్ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి మనికొండ మీదుగా కెనాల్ ద్వారా చెరువులను నింపుతాం. తద్వారా భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు పంటల సాగుకు పుష్కలంగా నీరు అందనుంది.
– మనోహర్, డీఈ, చిన్ననీటి పారుదల శాఖ