
చిక్కని చిరుత
● రెస్క్యూ బృందాలకు సవాల్
● నిపుణుల సహకారం తీసుకున్నా ఫలితం శూన్యం
● భయాందోళనలో పట్టణవాసులు
మహబూబ్‌నగర్ న్యూటౌన్: హైదరాబాద్ నుంచి రప్పించిన రెస్క్యూ టీం, అటవీ, పోలీసు బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నా చిరుత బోనుకు చిక్కడం లేదు. మహబూబ్‌నగర్ పట్టణానికి అతి సమీపంలోని తిర్మల్‌దేవునిగుట్ట, డంపింగ్ యార్డుల్లో కలియ తిరుగుతూ పరిసర ప్రాంతాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. రెస్క్యూ బృందం చిరుతను పట్టుకునేందుకు 40 రోజులుగా తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నా వారి కళ్లుగప్పి మరో చోట మెరుపులా కనిపిస్తూ దడ పుట్టిస్తోంది. స్వయంగా కలెక్టర్ విజయేందిర బోయి, ఎస్పీ డి.జానకి చిరుత సంచరిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. చిరుతను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేలా చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించడంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దీంతో సెర్చ్ బృందాలు ఎప్పటికప్పుడు చిరుత కదలికలను పర్యవేక్షిస్తూ పట్టుకునేందుకు తమదైన శైలిలో ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయినా ఫలితం లేకపోవడంతో చిరుతను పట్టుకునేదెలా అనే అయోమయంలో పడ్డాయి.
దట్టమైన పొదలు, రాళ్ల మధ్య..
టీడీగుట్ట, స్మశానవాటిక ఏరియాల్లో దట్టమైన చెట్ల పొదలు, పెద్ద పెద్ద రాళ్ల మధ్య గుహలే చిరుతను పట్టుకునేందుకు అడ్డంకిగా మారాయి. స్మశానవాటిక, టీడీగుట్ట ప్రాంతాల్లో చిరుతకు ఆహారం దొరకని సమయంలో పరిసర ప్రాంతాల్లోకి వచ్చి కుక్కలను పట్టుకొని వెళ్తుందని అటవీశాఖ అధికారుల అంచనా. ఏదైనా ఆహారం దొరికిన సమయంలో కనీసం మూడు రోజులు బయటికి రాకుండా ఉంటుంది. ఆ తర్వాత ఆహారం కోసం సంచరిస్తున్న సమయంలో అక్కడక్కడా ట్రాప్ కెమెరాలకు చిక్కుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు మరింతగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నా చిక్కడం లేదు.
5 డ్రోన్లు, 20 ట్రాప్ కెమెరాలు, 4 బోన్లు
చిరుతను పట్టుకునేందుకు ఆయా ప్రాంతాల్లో 4 బోన్లు ఏర్పాటుచేశారు. చిరుత సంచరిస్తున్న దారుల్లో 20 ట్రాప్ కెమెరాలు ఏర్పాటుచేసి కదలికలను గమనిస్తున్నారు. అంతే కాకుండా 4 డ్రోన్ కెమెరాలతో పై నుంచి చిరుత కదలికలను పర్యవేక్షిస్తున్నారు. దట్టమైన పొదలు, చెట్లు, రాళ్లు ఉండటం కారణంగా డ్రోన్ కెమెరాలకు చిరుత ఆనవాళ్లు ఏమాత్రం కనిపించడం లేదు. అయితే గుట్టపైనున్న గుండ్లపై ఎక్కి కిందకు దిగిన చిరుతను సమీప ప్రాంతాల ప్రజలు గమనించి అధికారులకు సమాచారం చేరవేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది.
నిపుణుల సూచనల మేరకు..
భయాందోళకు గురిచేస్తున్న చిరుతను బంధించేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో నిపుణుల సూచనల మేరకు సరికొత్త ఆలోచనలకు పదును పెట్టారు. చిరుత సంచరిస్తున్నా ప్రాంతాల్లో మేకలను చెట్టుకు కట్టి ఉంచడం, మత్తు ఇంజక్షన్లతో రెడీగా కాపలా కాయడం వంటి చర్యలు చేపడుతున్నారు. జిత్తులమారి చిరుతను పట్టుకునేందుకు అధికార యంత్రాంగం చేస్తున్న కృషి ఫలించాలని ఆశిద్దాం.
నిరంతర పర్యవేక్షణ..
చిరుత సంచారంపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు చేస్తూనే ఉన్నాం. బోన్లు ఏర్పాటు చేసి ట్రాప్ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నాం. నిపుణుల సూచనలు అమలు చేస్తున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మూడు షిఫ్టులుగా అటవీ బృందాలు పనిచేస్తున్నాయి.
– కమాలుద్దీన్, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్