
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా సైకిల్ యాత్ర
చారకొండ: పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఏపీ రాష్ట్రం కడప జిల్లా మైదుకూరు మండలం బస్వాపూర్‌కు చెందిన యువకుడు కార్తిక్‌రెడ్డి సైకిల్ యాత్ర చేపట్టారు. ఫిబ్రవరి 6న స్వగ్రామం నుంచి సేవ్ ట్రీ.. సేవ్ లైఫ్ అనే నినాదంతో సైకిల్ యాత్ర చేపట్టగా.. ఆదివారం చారకొండ మండలానికి చేరుకున్నాడు. ఈసందర్భంగా కార్తిక్‌రెడ్డి మట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు అందరం కృషి చేయాలన్నారు. పర్యావరణం ఎందుకు, ఎలా దెబ్బ తింటుంది, ఎలా సంరక్షించుకోవాలి తదితర అంశాలపై స్థానిక యువకులతో చర్చించారు. మానవాళి మనుగడకు చెట్లు చాలా అవసరమని వాటి ప్రాధాన్యతపై వివరించారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, గోవా, ఒడిశా రాష్ట్రాల మీదుగా దాదాపు 4200 కి.మీ సైకిల్‌యాత్ర పూర్తి చేశానని, మిగతా రాష్ట్రాల్లో తిరిగి ప్రజల్లో చైతన్యం కల్గించి యాత్ర ముగిస్తానని తెలిపారు. అనంతరం చారకొండ నుంచి దేవరకొండకు బయల్దేరారు.