
వైభవంగా రాఘవేంద్రస్వామి ఆరాధనోత్సవాలు
స్టేషన్ మహబూబ్‌నగర్: జిల్లాకేంద్రంలోని పరిమళగిరిపై వెలసిన రాఘవేంద్రస్వామి మఠంలో 354వ ఆరాధన ఉత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పూర్వారాధన వేడుకలు, వివిధ పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం సుప్రభాతసేవ, పాదపూజ, కనకాభిషేకం, వివిధ రకాల ఫలాలతో కూడిన ఫలపంచామృతాభిషేకం చేశారు. అర్చకులు స్వామివారి బృందావనానికి అభిషేకం జరిపారు. అలాగే అష్టోత్తర పారాయణం, తులసి అర్చన, నైవేద్యం, అనంతరం స్వామివారిని సుగంధ పుష్పాలతో అలంకరించారు. హస్తోదకం, మహామంగళహారతి ఇచ్చి.. సాయంత్రం స్వామివారిని మఠం ప్రాంగణంలో ఊరేగించారు. స్వామివారి ఆరాధనోత్సవాల్లో ఎంపీ డీకే అరుణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. కాగా.. ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం మధ్యారాధన వేడుకలు జరపనున్నారు. స్వామివారికి క్షీరాభిషేకం, ఫలపంచామృతాభిషేకం, సుగంధ పుష్పాలతో అలంకరణ తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు.