
బీసీ రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించాలి
అడ్డాకుల: తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదించాలని, లేదంటే బీజేపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకుడు కిల్లె గోపాల్, కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కుర్మయ్య అన్నారు. బీసీ బిల్లును ఆమోదించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం అడ్డాకులలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పేదల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉందని, ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించకుండా అడ్డుపడుతుందని విమర్శించారు. బీసీ రిజర్వేషన్లను ఆమోదిస్తే ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్ అందుతుందనే అబద్ధపు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ఎంపీలు కల్లబొళ్లి మాటలు చెబుతూ మోసం చేస్తున్నారని చెప్పారు. పార్లమెంట్‌లో 42 శాతం బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపాలని, లేదంటే కపట నాటకాన్ని ప్రదర్శిస్తున్న బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఆనాడు మండల్ కమిషన్‌కు వ్యతిరేకంగా రథయాత్రలు తీసుకువచ్చి బీసీ ఉద్యమాన్ని బీజేపీ పక్కకు నెట్టిందని విమర్శించారు. అణగారిన వర్గాలు అట్టడుగునే ఉండాలనుకునే బీజేపీ దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్ చెప్పినట్లే వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో కేవీపీఎస్ మండలాధ్యక్షుడు బాలరాజు, నాయకులు ప్రసాద్, ప్రశాంత్, ఆంజనేయులు, నర్సింహ, మోష, రాజేష్, శ్రీకాంత్, ప్రేమ్‌కుమార్, శంకర్ తదతరులు పాల్గొన్నారు.