
ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): గ్రామ పంచాయతీ భవనం మొదలుకొని రాష్ట్ర సెక్రెటరియేట్ వరకు అన్ని ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం ఆయన హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోలార్ విద్యుత్‌ను పెద్దఎత్తున ఉత్పత్తి చేయడానికి రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకోసం సోలార్ పవర్‌ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సోలార్ పవర్‌ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. అలాగే ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, కలెక్టర్లు ఎక్కువ అలసత్వం ప్రదర్శించకుండా వారంలోగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో కలెక్టర్ విజయేందిర, ఆర్‌అండ్‌బీ ఈఈ దేశ్యానాయక్, రెడ్కో ఉమ్మడి జిల్లా మేనేజర్ మనోహర్‌రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ఆదివాసీల హక్కులను కాపాడాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ఆదివాసీల హక్కులు కాపాడే బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని గిరిజన సంక్షేమాధికారి జనార్దన్ అన్నారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం జిల్లాకేంద్రంలోని గిరిజన బాలుర హాస్టల్‌లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అంతకు ముందు ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు మైదాన ప్రాంతానికి దూరంగా జీవిస్తుంటారని, ప్రభుత్వం వారి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆదివాసీలు తమ హక్కులను తెలుసుకోవాలని వారికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏటీడబ్ల్యూఓ చీన్యానాయక్, వార్డెన్ సబియాసుల్తానా, జ్ఞానేశ్వర్, గోపాల్, అర్చన తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్రోద్యమంలో క్విట్ ఇండియా కీలకపాత్ర
స్టేషన్ మహబూబ్‌నగర్: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించడంలో క్విట్ ఇండియా ఉద్యమం కీలకపాత్ర పోషించిందని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం క్విట్‌ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమం కీలకదశకు చేరినప్పుడూ మహాత్మగాంధీ ఇచ్చిన పిలుపుమేరకు యావత్ దేశంలోని ప్రజలు క్విట్ ఇండియా ఉద్యమంలో పెద్దఎత్తున పాల్గొన్నారన్నారు. దేశాభివృద్ధి కోసం తొలి ప్రధానమంత్రి నెహ్రూ అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలనలో అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు వివరించారు.

ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు

ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్లు