రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
మద్దూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మద్దూరు పట్టణ శివారులో ఆదివారం చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని నాగంపల్లి గ్రామానికి చెందిన లవకుమార్(20) మద్దూరు పట్టణానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఈక్రమంలో హెచ్‌పీ గ్యాస్ గోదాం దగ్గర ఉన్న మూల మలుపు దగ్గర మద్దూరు నుంచి వస్తున్న సిమెంట్ లారీ ఢీ కొట్టింది. దీంతో తలకు బలంగా తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, నాగంపల్లి గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. అప్పటికే లారీ డ్రైవర్ పరారయ్యాడు. న్యాయం జరిగే వరకు కదిలేది లేదని గ్రామస్తులు బైఠాయించడంతో ఎస్‌ఐ విజయ్‌కుమార్ అక్కడి చేరుకొని వారిని నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నారాయణపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లి అనంతమ్మ, కుటుంబ సభ్యుల రోదనలు పలువురిని కలిచివేశాయి. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం


