భారత్‌మాల భూసర్వేకు సహకరించాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: భారత్‌మాల భూసర్వేకు రైతులందరూ సహకరించాలని కలెక్టర్ విజయేందిర సూచించారు. జాతీయ రహదారి భూసేకరణపై బుధవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని అన్నాసాగర్, తాటికొండ, హస్నాపూర్‌కు చెందిన బాధిత రైతులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రా యాలను తెలుసుకున్నారు. కాగా, జాతీయ రహదా రి కోసం భూములు కోల్పోతే తమ జీవనోపాధి దెబ్బతింటుందని, దీని అలైన్‌మెంట్ మార్చాలని కోరారు. స్పందించిన ఆమె మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టినందున ఎన్‌హెచ్‌ఏఐ అధికారులకు నివేదిస్తామన్నారు. అక్కడి నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నడుచుకుంటామన్నారు. ము ఖ్యంగా భూసేకరణ కు సంబంధించి ని బంధనలననుసరించి తగిన పరిహారం ఇస్తామన్నారు. ఈ ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ బాధిత రైతుల సమస్యలను చట్టబద్ధంగా పరిష్కరిస్తామన్నారు. అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్, ఆర్‌డీఓ నవీన్ పాల్గొన్నారు.
సకాలంలో బోనస్ జమ చేయాలి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా ట్యాబ్ ఎంట్రీలను తక్షణమే వేగవంతం చేయాలని కలెక్టర్ విజయేందిర ఆదేశించారు. వరి కొనుగోళ్లపై కలెక్టర్ వీసీ నిర్వహించారు. గోదాముల్లో తగినంత స్థలం అందుబాటులో ఉన్నందున, పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్‌ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. మంగళవారం వరకు మొత్తం 1,21,577 మెట్రిక్ టన్నుల వరిని 23,451 మంది రైతుల నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీని విలువ రూ.290కోట్లు కాగా, 20,288మంది రైతులకు రూ.251 కోట్లు ఎంఎస్పీగా చెల్లించినట్లు చెప్పారు. కొనుగోళ్లు, ఆన్‌లైన్ ఎంట్రీల మధ్య ఉన్న గ్యాప్‌ను మూడు రోజుల్లో తగ్గించాలని సూచించారు. కొనుగోలు చివరి దశలో ఉన్నందున, ఎలాంటి ప్రతికూల ఫిర్యాదులు రాకుండా అధికారులు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.


