శిక్షణతో వృత్తి నైపుణ్యం మెరుగు
మన్ననూర్: జర్నలిస్టులు శిక్షణ తరగతులు నిర్వహించుకోవడంతో మరింత పరిజ్ఞానం, వృత్తి నైపుణ్యం పెంచుకునే అవకాశాలుంటాయని ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి సూచనప్రాయంగా అన్నారు. గురువారం మన్ననూర్‌లోని అటవీశాఖ వనమాళిక ప్రాంగణంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు సంఘం, అటవీశాఖ సంయుక్త ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడారు. జర్నలిజంలో ఎదురవుతున్న సమస్యలను తట్టుకుని ముందుకెళ్లాలంటే ప్రతి ఒక్కరు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా తమ పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు. సెల్‌ఫోన్స్ వాట్సాప్, ఇంస్ర్ట్రాగామ్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కడో జరిగిన సంఘటనలు క్షణాల్లో మన ముందు ఉంచుతుందని, అయినప్పటికి ప్రజలు, పాఠకులు వాటి అన్నిటి గురించి ఆలోచించకుండా దేనికి ఇచ్చే ప్రాధాన్యత దానికే ఇస్తున్నారని గుర్తు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమం ములుగు జిల్లాలో ఏర్పాటు చేయాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాలతో నల్లమలలో ఏర్పాటు చేస్తున్నందున ఈ ప్రాంతంలోని జర్నలిస్టులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జర్నలిస్టులు జ్ఞానం పెంచుకునేందుకు 10 రకాల పుస్తకాల కిట్టును ప్రతి ఒక్కరికి అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి మాట్లాడారు. మారుమూల ప్రాంతంలో ఇలాంటి శిక్షణ తరగతులు ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ కమ్యూనిటీ ఆర్గనైజర్ శ్వేత, సంపాదకులు శ్రీనివాస్, విశాలాంధ్ర ఎడిటర్ ఆర్‌వీ రామారావు, దిశ ఎడిటర్ మార్కండేయ, ఐజేయూ జిల్లా నాయకుడు సుదర్శన్ రెడ్డి, జర్నలిస్టులు రాములు, పూర్ణ చంద్రరావు, కర్ణయ్య, శనేశ్వర్‌రెడ్డి, రెహమాన్, సాయిబాబు, శ్రీనివాస్, ప్రభాకర్, లక్ష్మీపతి, బాలస్వామి, వెంకటయ్య, శ్రీధర్‌లతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ జర్నలిస్టులు సుమారు 90 మంది పాల్గొన్నారు.
ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి


