జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): జిల్లాలో 2024–25 యాసంగి సీజన్‌కు సంబంధించి గతం కంటే రికార్డుస్థాయిలో కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ విజయేందిర తెలిపారు. 2023–24 యాసంగి సీజన్‌లో 2024 మే 28 నాటికి 23,926.48 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 4,625 మంది రైతులకు రూ.52.71 కోట్లు చెల్లించామన్నారు. ఈ యాసంగిలో మే 28 తేదీ నాటికి 192 ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 26,792 మంది రైతుల నుంచి రూ.323.09 కోట్ల విలువ గల 1,39,261 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. ఇందులో 22,348 మంది రైతులకు రూ.276.32 కోట్లు చెల్లించామన్నారు.
ఇందులో దొడ్డు రకం 45,679 మెట్రిక్ టన్నులు, సన్న రకం 93,581 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు వివరించారు. జిల్లాలో 68 మిల్లులకు టాగ్ చేసి 1,38,112 మెట్రిక్ టన్నుల ధాన్యం రవాణా చేశామని పేర్కొన్నా రు. ఐకేపీ ద్వారా 109, పీఏసీఎస్ ద్వారా 82, మెప్మా ద్వారా ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు తుది దశకు చేరుకున్నట్లు, జిల్లాలో 82 ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూసి వేసినట్లు తెలిపారు. రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, అకాల వర్షాలకు రైతులు అధైర్యపడొద్దని, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండి ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గోవుల అక్రమ రవాణా కట్టడికి చెక్ పోస్టులు
మహబూబ్‌నగర్ క్రైం: గోవుల అక్రమ రవాణా నియంత్రణ కోసం కోయిలకొండ ఎక్స్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టును గురువారం ఎస్పీ డి.జానకి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్థానికంగా విధులు నిర్వహించే సిబ్బందికి ప్రత్యేక సూచనలు అందించారు. జిల్లాలో గోవుల అక్రమ రవాణాను అరికట్టడానికి జిల్లా సరిహద్దుల్లో ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. 24 గంటల పాటు నిరంతరం నిఘా, పర్యవేక్షణ కొనసాగాలన్నారు. ప్రత్యేక చెక్ పోస్ట్‌లలో పోలీస్, పశుసంవర్ధక శాఖ సిబ్బందితో షిప్ట్‌ల వారీగా సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణ కోసం ముందస్తు చర్యలలో భాగంగా ఆవుల రవాణా విషయంలో వివాదాలు తలెత్తకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రధానంగా జంతువుల అక్రమ రవాణా, గోవధ విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రధానంగా బక్రీద్ నేపథ్యంలో పశువుల రవాణా విషయంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తనిఖీల్లో వన్‌టౌన్ సీఐ అప్పయ్య పాల్గొన్నారు.
1న మహిళా క్రికెట్ జట్టు ఎంపిక
మహబూబ్‌నగర్ క్రీడలు: త్వరలో జరిగే హెచ్‌సీఏ ఉమెన్ టోర్నీల్లో పాల్గొనే ఉమ్మడి మహిళా జట్టు ఎంపికలను ఆదివారం ఉదయం 10 గంటలకు జిల్లాకేంద్రం పిల్లలమర్రి రోడ్డు సమీపంలోని క్రికెట్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ గురువారం తెలిపారు. క్రీడాకారిణులు వైట్‌డ్రెస్, ఆధార్‌కార్డు, ఫొటోతో ఎంపికలకు హాజరుకావాలని సూచించారు.
ఆస్పత్రిని సందర్శించిన డబ్ల్యూహెచ్‌ఓ బృందం
పాలమూరు: జిల్లా జనరల్ ఆస్పత్రిని గురువారం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌ఓ) బృందం సందర్శించింది. స్థానికంగా ఉన్న విభాగాలు, వార్డులు, క్యాజువాలిటీ, గైనిక్ విభాగాలను పరిశీలించారు. స్థానికంగా రోగులకు అందుతున్న సేవలు, ఇతర అంశాలపై బృందం సభ్యులు ఆరా తీశారు. డబ్ల్యూహెచ్‌ఓ బృందానికి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్‌కుమార్ అన్ని రకాల అంశాలను వివరించారు.
నేడు డయల్ యువర్ డీఎం
స్టేషన్ మహబూబ్‌నగర్: డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నట్లు మహబూబ్‌నగర్ ఆర్టీసీ డిపో మేనేజర్ సుజాత గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు ప్రయాణికులు తమ సూచనలు, సలహాలను 99592 26295 నంబర్‌కు తెలియజేయాలని ఆమె కోరారు.
రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు: కలెక్టర్


