ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల్లో స్టడీ సెంటర్‌లు లేవని, వాటిలో వెంటనే స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేసుకునేందుకు హెచ్‌ఎంలు ముందుకు రావాలని ఉమ్మడి జిల్లా ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ శివయ్య పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని జేపీఎన్‌సీఈ కళాశాలలో హెచ్‌ఎంలకు శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిడ్జిల్, మూసాపేట, అడ్డాకుల వంటి మండలాల్లో ఒక్క స్టడీ సెంటర్లు కూడా లేవని వెంటనే ఏర్పాటు చేసుకునేందుకు ముందు రావాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థులకు స్టడీ సెంటర్లు ఏర్పాటు చేసి అడ్మిషన్లను ఇచ్చేందుకు అవకాశం ఉందన్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్‌లను ఏర్పాటు చేసుకునేందుకు అడిగిన వారికి అనుమతి ఇస్తామన్నారు. అక్షరాస్యతను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అందులో భాగంగా సెంటర్‌లు ఏర్పాటు చేసి, నిరక్షరాస్యులు ఎస్సెస్సీ, ఇంటర్ చేసేందుకు అవకాశం లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్, సీఎంఓ బాలుయాదవ్ పాల్గొన్నారు.


