
సంస్కృతి ప్రతిబింబించేలా ప్రదర్శనలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మిస్ వరల్డ్ పోటీదారులు పిల్లలమర్రి సందర్శన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మనదేశంలోని వివిధ రాష్ట్రాల సంస్కృతి ప్రతిబింబించేలా కళాకారులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. కూచిపూడి, భరతనాట్యం, ఓడియా, కథక్, కేరళ జానపద కళాకారులు సుమారు 20 నిమిషాలపాటు ప్రదర్శన ఇచ్చారు. ‘మేరా ఇండియా.. ప్యారా ఇండియా’ పాట సందర్భంగా మిస్ వరల్డ్ పోటీదారులు జాతీయ జెండాలను చేతబూనగా చప్పట్లతో పిల్లలమర్రి ప్రాంగణం మార్మోగింది. అనంతరం కళాకారులు ప్రదర్శించిన పేరిణి నృత్యం ఉర్రూతలూగించింది. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, జి.మధుసూదన్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, పర్ణికారెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, వీర్లపల్లి శంకర్, కొడంగల్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎనుముల తిరుపతిరెడ్డి, పాలమూరు మార్కెట్ చైర్మన్ బెక్కరి అనిత, అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
●
పిల్లలమర్రి ఆధ్యాత్మిక
సముదాయం..
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పాలనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీ రాక చాలా సంతోషం కలిగించింది. ఈ ప్రాంతానికి ప్రపంచ వ్యాప్త ప్రాముఖ్యతను తెచ్చిపెట్టింది. తెలంగాణ ఆహ్లాదకరమైన వాతావరణం కలిగి ఉంటుంది. ప్రేమగల ప్రజలు ఉన్న భూమి ఇది. తెలంగాణలో సాంస్కృతిక విలువలు, జ్ఞానోదయం, వినోదం కలిసి సాగుతాయి. పిల్లలమర్రిని తెలంగాణ ప్రభుత్వం ఒక ఆధ్యాత్మిక సముదాయంగా అభివృద్ధి చేసింది. చెట్టు, ఆలయం ఆకట్టుకునే కలయికగా ఉండడమే ఇందుకు నిదర్శనం. పర్యాటకాభివృద్ధితో ఎంతో మందికి స్వయం ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాంత సామాజిక అభివృద్ధికి పర్యాటక రంగం దోహదం చేస్తుంది. ఇక్కడి సంస్కృతీ సంప్రదాయాలు, పర్యాటక ప్రాంతాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేయాలి. – జూపల్లి కృష్ణారావు,
రాష్ట్ర పర్యాటక, ఎకై ్సజ్ శాఖ మంత్రి
దేశానికే గర్వకారణం..
పిల్లలమర్రి పాలమూరు జిల్లాకే కాదు.. తెలంగాణ రాష్ట్రం, భారతదేశానికి గర్వకారణం. దీని విశిష్టతను తెలుసుకునేందుకు మిస్ వరల్డ్ పోటీదారులు రావడం ఆనందంగా ఉంది. వారు ఎన్నో తీపి జ్ఞాపకాలతో తిరిగి వెళతారు. ఈ పిల్లలమర్రి మహావృక్షం 700 సంవత్సరాల క్రితం జన్మించింది.. మరో 700 ఏళ్లు జీవించి ఉంటుంది.
– యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే
బందోబస్తు పర్యవేక్షించిన డీఐజీ
మహబూబ్‌నగర్ క్రైం: మిస్ వరల్డ్ 2025 పోటీదారుల బృందం పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రపంచ సుందరీమణుల బృందం చుట్టూ మహిళా పోలీస్ సిబ్బంది సఫారీ సూట్‌లలో రక్షణ వలగా ఉంటూ విధులు నిర్వహించారు. జోగుళాంబ జోన్ డీఐజీ ఎల్‌ఎస్ చౌహన్, ఎస్పీ డి.జానకి, గద్వాల ఎస్పీ తోట శ్రీనివాస్ బందోబస్తును పర్యవేక్షించారు. మెట్టుగడ్డ నుంచి పిల్లలమర్రి వరకు రోడ్డుకు ఇరువైపుల కానిస్టేబుల్స్ పహారా కాశారు.