కారు ఢీకొని యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని యువకుడి దుర్మరణం

May 17 2025 6:47 AM | Updated on May 17 2025 6:47 AM

కారు ఢీకొని యువకుడి దుర్మరణం

కారు ఢీకొని యువకుడి దుర్మరణం

మరికల్‌: వేగంగా వచ్చి అదుపు తప్పిన ఓ కారు రెండు బైకులను ఢీ కొట్టడంతో ఒకరు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన అర్ధరాత్రి మరికల్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మరికల్‌కు చెందిన రంగలి శ్రీకాంత్‌ అలియాస్‌ (శ్రీనివాసులు)(22), చిన్నచింతకుంట మండలం ఉంధ్యాలకు చెందిన శివారెడ్డి వేరువేరుగా రెండు బైక్‌లపై వస్తున్నారు. మరికల్‌ పెంట్రోల్‌ బంకు సమీపంలో ఎదురుగా వస్తున్న ఓ కారు అదుపు తప్పి వేగంగా రెండు బైక్‌లను ఢీకొట్టింది. క్షతగాత్రులను 108 అంబులైన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మరికల్‌ చెందిన శ్రీకాంత్‌ మృతి చెందాడు. శివారెడ్డి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన శ్రీకాంత్‌కు 14 నెలల కిందటే పెళ్లి కాగా.. భార్య హైదరాబాద్‌లో నర్సింగ్‌ చదువుతోంది. దీంతో మరికల్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాము తెలిపారు.

చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి

అడ్డాకుల: మండలకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్‌ తెలిపారు. కౌకుంట్ల మండలం పేరూర్‌కి చెందిన ముసలన్న(60) అడ్డాకుల వద్ద రోడ్డు దాటుతుండగా కర్నూలు వైపు వెళ్లే డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముసలన్నను పోలీసులు అంబులెన్స్‌లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. ప్రమాద సమయంలో వృద్ధుడు అపస్మారక స్థితికి చేరుకోగా వివరాలు తెలియరాలేదు. తర్వాత కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించడంతో వృద్ధుడిని పేరూర్‌కు చెందిన ముసలన్నగా గుర్తించి ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

నీటిసంపులో పడివ్యక్తి మృతి

పాన్‌గల్‌: ప్రమాదవశాత్తుతో నీటి సంపులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకుంది. ప్రొబేషన్‌ ఎస్‌ఐ హిమాబిందు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూల్‌ జిల్లా పెద్దకొత్తపల్లి మండలంలోని జొన్నలబొగడ తండాకు చెందిన రత్నావత్‌ భీమ్లానాయక్‌ (42) పెయింటింగ్‌ వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రెండు నెలల నుంచి మండలంలోని కేతేపల్లిలో ఎల్లమ్మ గుడికి పెయింటింగ్‌ వేసేందుకు వచ్చి, అక్కడే ఉంటూ అప్పుడప్పుడు ఇంటికి వెళ్లేవాడు. శుక్రవారం ఉదయం గుడి ముందు ఉండే నీటి సంపులో కళ్ల అద్దాలు పడిపోయాయని, వాటిని తీసేందుకు సంపులోకి దిగి ప్రమాదవశాత్తుతో నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయాడు. ఈ ఘటనపై ఎలాంటి అనుమానం లేదని మృతుడి భార్య చంద్రకళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు.

ప్రేమ వ్యవహారంలో మనస్తాపం

యువకుడి ఆత్మహత్య

చేవెళ్ల: ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కంసాన్‌పల్లికి చెందిన కుమ్మరి రవి(22) నార్సింగి పరిధిలో ఆటో నడిపేవాడు. ఇతనికి ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు సమాచారం. ఇదే విషయమై ఇరువురి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విరక్తి చెందిన రవి శుక్రవారం ఉదయం తన ఆటోలో చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల అటవీ ప్రాంతానికి వచ్చి చెట్టుకు ఉరేసుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆటో నంబర్‌ ఆధారంగా వివరాలు సేకరించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి తల్లి బాబమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

యువకుడిపై

పోక్సో కేసు నమోదు

ఖిల్లాఘనపురం: మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడిపై శుక్రవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేష్‌గౌడ్‌ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. ఖిల్లాఘనపురం గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన ఓ మైనర్‌ బాలికను ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి బైక్‌పై ఎక్కించుకుని తిరగడంతో పాటుగా కుటుంబ సభ్యులకు తెలియకుండా పలుచోట్లకు తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న బాలిక తండ్రి శుక్రవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా యువకుడిపై పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement