
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
శాంతినగర్: కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వడ్డేపల్లి మండలంలోని కొంకలలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం.. కొంకల గ్రామానికి చెందిన కురువ ఈరన్న(38) నాలుగేళ్లుగా కడుపునొప్పితో బాధపడుతున్నాడు. బుధవారం సాయంత్రం కడుపునొప్పి ఎక్కువ కావడంతో జూలెకల్ శివారులోని వ్యవసాయ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూలెకల్ రైతులు ఈ సమాచారం కుటుంబసభ్యులు అందించడంతో ఈరన్నను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. అతని భార్య కురువ సరోజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
చికిత్స పొందుతూ
ఏఎల్‌ఎం మృతి
శాంతినగర్: గడ్డిమందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురైన విద్యుత్‌శాఖకు చెందిన ఏఎల్‌ఎం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ నాగశేఖర్ రెడ్డి తెలిపారు. అలంపూర్ మండలం లింగనవాయికి చెందిన ఏఎల్‌ఎం చాకలి రాజశేఖర్ శాంతినగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మద్దూరు శివారులో పొలంలోని గెట్లకు ఉన్న గడ్డిని తొలగించేందుకు ఈనెల 4న గడ్డి మందు కొట్టడానికి వెళ్లాడు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా మందు పిచికారీ చేశాడు. మందు కొడుతున్న సమయంలో ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి పోవడంతో అస్వస్థతకు గురికావడంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్‌ఐ వివరించాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పేర్కొన్నాడు.
మృతదేహం లభ్యం
ఇటిక్యాల: ఎర్రవల్లి మండలంలోని వేముల గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో పడి గల్లంతైన వ్యక్తి మృతదేహం గురువారం లభించినట్లు కోదండాపురం ఎస్‌ఐ మురళి తెలిపారు. ఎస్‌ఐ వివరాల ప్రకారం.. వనపర్తి జిల్లా కొంకాలపల్లి గ్రామానికి చెందిన శేషయ్య(56) బుధవారం దేవర నిమిత్తం కోదండాపురంలో తమ బంధువుల ఇంటికి వచ్చాడు. అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరితో కలిసి వేముల శివారులోని జక్కం బావి దగ్గరకు ఈత పడేందుకు వెళ్లగా, ప్రమాదవశాత్తు బావిలో కాలు ఇరుక్కొని గళ్లంతయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని రెండు రోజుల పాటు శ్రమించి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడి కుమారుడు రాంభూపాల్ ఫిర్యాదు మేరకు సంఘటనఫై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
వృద్ధుడికి తీవ్ర గాయాలు
అడ్డాకుల: మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న డీసీఎం అడ్డాకుల పోలీస్‌స్టేషన్ సమీపంలో రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడికి తలకు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వృద్ధుడిని అంబులెన్స్‌లో జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వృద్ధుడు అపస్మారక స్థితికి చేరుకోవడంతో వివరాలు తెలియ రాలేదని ఎస్‌ఐ ఎం.శ్రీనివాస్ తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వృద్ధుడి ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు.
హైవేపై ఘోరం
● కొడుకుతో కలిసి బైక్‌పై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం
● భార్య మృతి.. తండ్రీకొడుకుకు తీవ్రగాయాలు
ఇటిక్యాల: కొడుకుతో కలిసి బైక్‌పై బయల్దేరిన భార్యాభర్తలను విధి వక్రీకరించింది. గుర్తుతెలియని వాహనం రూపంలో మృత్యువు వెంటాడింది. 44వ నంబర్ జాతీయ రహదారిపై చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో భార్య మృతిచెందగా.. తండ్రీకొడుకుకు తీవ్రగాయాలయ్యాయి. ఎస్‌ఐ వెంకటేశ్ వివరాల మేరకు.. అయిజ మండలం గురుదొడ్డి గ్రామానికి చెందిన ఉస్సేన్ రెడ్డి గురువారం తెల్లవారుజామున తన భార్య తిమ్మమ్మ (30), 13ఏళ్ల కుమారుడు జగన్మోహన్‌రెడ్డితో కలిసి ద్విచక్ర వాహనంపై వనపర్తి జిల్లా గంగవరం గ్రామంలోని తన చెల్లెల్లి వద్దకు బయలుదేరారు. మార్గమధ్యంలోని ఎర్రవల్లి మండలం జింకలపల్లి సమీపంలో జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం వీరి బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో అతడి భార్య తిమ్మమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. ఉస్సెన్ రెడ్డి, అతడి కొడుకు జగన్మోహన్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘట నా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైవే అంబులెన్స్‌లో గద్వాల ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి సోదరుడు దేవేందర్ రెడ్డి ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.