
నేడు ఆలయ భూముల కౌలు వేలం
అలంపూర్: అలంపూర్ క్షేత్ర ఆలయాల భూముల కౌలు వేలం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ పురేందర్‌కుమార్, చైర్మన్ నాగేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు భూముల బహిరంగ వేలం ప్రారంభమవుతుందన్నారు. ఏప్రిల్ 21న ఆలయాలకు సంబంధించిన పలు సర్వే నెంబర్లలోని భూముల బహిరంగ కౌలు వేలం నిర్వహించినట్లు తెలిపారు. ఈ వేలం పాటలో కొన్ని సర్వే నంబర్లకు సరైన కౌలు ధర రాకపోవడంతో వేలం నిలిపివేసినట్లు తెలిపారు. వాటికి సంబంధించి ఈ నెల 2న మరోసారి వేలం నిర్వహించినా.. రైతులు ఆసక్తి చూపకపోవడంతో శుక్రవారం మూడోసారి వేలం నిర్వహిస్తున్నామన్నారు. తక్కశీల గ్రామంలోని సర్వే నంబర్ 253లో 4.04 ఎకరాల భూమి మాదక్క పట్టెలు పొలం, అలంపూర్ శివారులోని సర్వే నంబర్ 566లో 9.28 ఎకరాలు కుమ్మరి గుట్టల పొలం, సర్వే నంబర్ 960లోని 9.04 ఎకరాలు తంగడి మాను చేను, బైరంపల్లిలోని సర్వే నంబర్ 11లోని 11.13 ఎకరాలు ఈదుల గడ్డ పొలం, చందాపూర్‌లోని సర్వే నంబర్ 20లో ఉన్న 7.08 ఎకరాలు, కర్నూల్ జిల్లాలోని కల్లూరులో సర్వే నంబర్ 346/1, 346/3లోని 15.18 ఎకరాలు పెరుగువాని చేనుకు కౌలు వేలం కొనసాగుతుందన్నారు. వేలంలో పాల్గొనే రైతులు రూ.50 వేలు డిపాజిట్ ఆలయ ఈఓ పేరు మీద డీడీ తీసి ఇవ్వాలని, ఆధార్ కార్డుతో పాటు ఏదైన బ్యాంకు ఖాతాలకు సంబంధించిన రెండు చెక్కులు సమర్పించాలని కోరారు. పాత బకాయిలు ఉన్న రైతులు, ఇతర బకాయిలు ఉన్న రైతులు వేలం పాటలో పాల్గొనడానికి అనర్హులుగా పేర్కొన్నారు. వివరాలకు 94404 54656, 88867 61196 నంబర్లను సంప్రదించాలని సూచించారు.