
కాంగ్రెస్ పార్టీ బలోపేతమే ధ్యేయం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయం ఆవరణలో డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. వచ్చే మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 నుంచి 55 మంది వరకు కార్పొరేటర్లను గెలిపించుకోవాలన్నారు. అలాగే గ్రామ వార్డు సభ్యుడు మొదలుకొని ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల వరకు అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడానికి కృషి చేయాలన్నారు. గ్రూపు రాజకీయాలు, పాత, కొత్త అనే తారతమ్యాలు లేకుండా అందరూ ఏకతాటిపై నడవాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. రిజర్వేషన్లు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో అధిష్టానం సూచించిన విధంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు. వచ్చే జూలై మొదటి వారంలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా పరిశీలకులు గుమ్మడి సాంబయ్య, భాస్కర్‌యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్‌కుమార్, సంజీవ్ ముదిరాజ్, అధికార ప్రతినిధి జహీర్‌అక్తర్, కార్యదర్శి నయీం, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, నాయకులు సిరాజ్‌ఖాద్రీ, ఎన్పీ వెంకటేష్, సురేందర్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, సాయిబాబా, లింగంనాయక్, రాములుయాదవ్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.