నారాయణపేట: మొబైల్ పోయిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లో కానీ సీఈఐఆర్ వెబ్ పోర్టల్ లో కానీ ఫిర్యాదు చేయాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ తెలిపారు. బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో గత రెండు నెలల్లో జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైళ్లు పోగొట్టుకున్న 47 మంది బాధితుల మొబైల్ ఫోన్లను కనిపెట్టి తిరిగి ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. నూతన టెక్నాలజీ ఆధారంగా నారాయణపేట జిల్లా పరిధిలో 47 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగిందని, వాటి విలువ సుమారు రూ.7 లక్షలు ఉంటుందని తెలిపారు. మొబైల్ ఫోన్లను బాధితులకు అప్పగించడం జరిగిందన్నారు. ఎవరు పాత మొబైల్ ఫోన్లను కొనరాదన్నారు. మొబైళ్ల రికవరీలో కీలక పాత్ర పోషించిన ఐటి కోర్ కానిస్టేబుల్ రమేష్ ఎస్పీ అభినందించారు.