మహబూబ్‌నగర్ రూరల్: శిశుగృహలో ఉన్న చిన్నారుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక దృష్టి పెట్టినట్లు కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌కు చెందిన ఫెర్నాండేజ్ ఫౌండేషన్ మెడికల్ టీమ్, జీజీహెచ్ డాక్టర్లు, ఆర్‌బీఎస్‌కే వైద్యులతో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిశుగృహ చిన్నారులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. పిల్లలు ఇంటి వాతావరణంలో పెరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. శిశుగృహలోని ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు కావాల్సిన వైద్య సహాయం అందిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్, డీడబ్ల్యూఓ జరీనాబేగం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ సంపత్‌కుమార్ సింగ్, సీడీపీఓలు శైలాశ్రీ, రాధిక, ఏసీడీపీఓ వెంకటమ్మ, డీసీపీఓ నర్మద, శిశుగృహ మేనేజర్ గణేష్‌బాబు పాల్గొన్నారు.
భవిత సెంటర్లలో శిక్షణ
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు భవిత సెంటర్లలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర తెలిపారు. సమగ్ర శిక్ష సమావేశ మందిరంలో నిర్వహించిన దివ్యాంగ విద్యార్థుల ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిత సెంటర్లలో ఇస్తున్న ప్రత్యేక శిక్షణ దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకొని వారికి జీవన నైపుణ్యాలు నేర్పించాలన్నారు. ఇక నుంచి వారానికి రెండుసార్లు భవిత సెంటర్లలో ఫిజియోథెరపీ సేవలు అందిస్తామన్నారు. దివ్యాంగ విద్యార్థులు ఏ విషయంలో కూడా తక్కువ కాదని వారికి ప్రత్యేకమైన నైపుణ్యాలు పుట్టుకతోనే వస్తాయని, వారిలో గల సృజనాత్మకతను నైపుణ్యాలను గుర్తించి వెలికి తీస్తే వారు చాలా ప్రతిభావంతులుగా మారుతారని తెలిపారు. గత ఆగస్టులో నిర్వహించిన అసెస్మెంట్ క్యాంపులో నుంచి 183 మంది విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన సుమారు రూ.16 లక్షలు విలువైన సహాయ ఉపకరణాలను కలెక్టర్ అందజేశారు. డీఈఓ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ పదో తరగతి పరీక్షల్లో కూడా భవిత సెంటర్లలో చదివే విద్యార్థులకు ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పిస్తామని, వాటిని ఉపయోగించుకొని ఆయా పరీక్షల్లో సులభంగా ఉత్తీర్ణులు కావచ్చని తెలిపారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష సీఎంఓ బాలుయాదవ్, ఏఎంఓ దుంకుడు శ్రీనివాస్ ఎంఈఓ లక్ష్మణ్ సింగ్ పాల్గొన్నారు