మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించాలని కలెక్టర్ రవినాయక్ అన్నారు. రెడ్‌క్రాస్ విద్యానిధి సహకారంతో గాంధీ, కాకతీయ ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న సి.గోపిక, ఎం.హరితలకు మంగళవారం కలెక్టర్ బంగ్లాలో ఒక్కొక్కరికి రూ.లక్ష విలువజేసే చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్–2021లో ఉత్తమ ర్యాంకు సాధించి పేదరికంతో వైద్య విద్య చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న విద్యార్థులకు రెడ్‌క్రాస్ విద్యానిధి ద్వారా ఏటా ఆర్థిక సాయం అందించడం అభినందనీయమన్నారు. రెడ్‌క్రాస్ విద్యానిధి సహకారంతో మెడిసిన్ రెండో సంవత్సరంలో 71 శాతం మార్కులతో గోపిక, 65 శాతం మార్కులతో హరిత ఉత్తీర్ణత సాధించినందుకు కలెక్టర్ సన్మానించారు. అనంతరం రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ లయన్ నటరాజ్ మాట్లాడుతూ ప్రతిభ కలిగిన పేద విద్యార్థులను ప్రోత్సహించేందుకు దాతలు ముందుకురావాలని కోరారు. రెడ్‌క్రాస్ విద్యానిధి నుంచి ఎంబీబీఎస్ చదువుతున్న నలుగురు విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీ వైస్ చైర్మన్ శామ్యూల్, కోశాధికారి జగపతిరావు, ఎంసీ సభ్యుడు, యూత్ రెడ్ సమన్వయకర్త బాబుల్‌రెడ్డి, జూనియర్ రెడ్‌క్రాస్ సమన్వయకర్త అశ్విని చంద్రశేఖర్, మేనేజర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.