ఆత్మ ఘోష..! | Sakshi
Sakshi News home page

ఆత్మ ఘోష..!

Published Sat, May 18 2024 6:30 AM

ఆత్మ

మూలనపడిన వ్యవసాయ సాంకేతిక పథకం

ఐదేళ్లుగా నిధులు రాక నీరసం

రైతులకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలకు బ్రేక్‌

ఇతర విధుల్లోకి ఆత్మ సిబ్బంది

నీరుగారుతున్న పథకం లక్ష్యం

మహబూబ్‌నగర్‌ (వ్యవసాయం): రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) నిధులు లేక నీరసించిపోతోంది. ఎలాంటి కార్యక్రమాలు లేక నామమాత్రంగా మారడం.. పట్టించుకునే వారు లేక ఘోషిస్తుంది. ఆత్మ ఆధ్వర్యంలో రైతులను చైతన్యవంతం చేసేందుకు సదస్సులు, ప్రదర్శనలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా, ఆ దిశగా ఎలాంటి కృషి జరగడం లేదు. యంత్రాలు కొనుగోలు చేసినప్పటికీ వాటిపై అవగాహన కల్పించవారే లేరు. వరి, పత్తి, కందులు, పెసర, శనగ తదితర పంటలతో పాటు మామిడి, జామ తోట లను పెంచుతున్న వారికి సూచనలు, సలహాలు ఇవ్వడానికి ఆత్మ సంస్థను ఏర్పాటు చేశారు. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఆత్మ ఏర్పాటు లక్ష్యం నీరిగారిపోతుంది.

శిక్షణే లక్ష్యం...

వ్యవసాయశాఖలో ‘ఆత్మ’ అంతర్భాగం. వ్యవసాయశాఖ సిబ్బంది పంటల సాగు, విస్తీర్ణం, సస్యరక్షణ చర్యలు, పంటల సర్వే, పంట మార్పిడిపై అవగాహన కల్పించడం తదితర కార్యక్రమాలను పర్యవేక్షిస్తే.. వ్యవసాయరంగంలో చోటు చేసుకుంటున్న ఆధునిక మార్పులను రైతులకు ఎప్పటికప్పుడు తెలియచెప్పడం ఆత్మ పని. 2006లో ప్రారంభమైన ఈ పథకం కింద కలెక్టర్‌ చైర్మన్‌గా, వ్యవసాయశాఖ అఽధికారి కన్వీనర్‌గా ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశారు. డివిజన్‌స్థాయిలో ఈ కమిటీలు ఉండేవి. అధికారులు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లి రైతులకు సాగుపై అవగాహన కల్పించేవారు. పశు సంవర్థకశాఖ, ఉద్యాన, మత్స్యశాఖల్లో సాంకేతికంగా వచ్చే అనేక మార్పులకు సంబంధించిన అంశాలు అధికారులు వివరించేవారు. ప్రస్తుతం ఇవేం జరగడం లేదు. ఇప్పుడు కమిటీలు కూడా ఏమీ లేవు. దీనికి ఇది వరకు చైర్మన్‌ కూడా ఉండేవారు. ఇప్పుడు ఎవరూ లేరు. దీంతో ఈ పథకం ఉందన్న విషయం చాలా మంది రైతులకు తెలియని పరిస్థితి. కార్యాలయం ఎక్కడ ఉంది, దానిలో ఎంతమంది పని చేస్తారు, వారి ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుంది అనే అంశాలపై చాలా మంది రైతులకు ఇప్పటి వరకు అవగాహన లేదు. ఐదేళ్ల క్రితం వరకు చురుకుగా పనిచేసిన ఆత్మ.. ఆ తర్వాత కార్యక్రమాలు అటకెక్కాయి. జిల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలోనే ఒక పక్కన ఆత్మ కార్యాలయం ఉంది.

ఆత్మ ఘోష..!
1/1

ఆత్మ ఘోష..!

Advertisement
 
Advertisement
 
Advertisement