సీఎంను విమర్శించే స్థాయి డీకే అరుణకు లేదు : ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

సీఎంను విమర్శించే స్థాయి డీకే అరుణకు లేదు : ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

Apr 2 2024 1:30 AM | Updated on Apr 2 2024 2:13 PM

- - Sakshi

మాట్లాడుతున్న ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి

మహబూబ్‌నగర్‌: రాష్ట్రంలో ప్రజా పాలన అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించే స్థాయి డీకే అరుణకు లేదని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కుటుంబ అవసరాల కోసమే రాజకీయాల్లో ఉన్న డీకే అరుణ సీఎం రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తగదన్నారు. మిమ్మల్ని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిందని గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.

కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలుచేస్తున్నామని, పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సీఎం కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. డీకే అరుణ పాలమూరుకు చేసిందేమిలేదని, ఆమె మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కేంద్రంలో మోదీ, పాలమూరులో డీకే అరుణ ఓడిపోనున్నారని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని, రాహుల్‌ ప్రధాని అవుతారన్నారు.

ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి 2 లక్షల మెజార్టీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందా అని విలేకరి అడిగిన ప్రశ్నకు అలాంటి వ్యక్తులను పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదని చెప్పారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌కుమార్‌, అధికార ప్రతినిధి హర్షవర్ధన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఆనంద్‌గౌడ్‌, మాజీ చైర్మన్‌ రాధ, నాయకులు బెనహర్‌, బెక్కరి అనిత, సిరాజ్‌ ఖాద్రీ, సాయిబాబా, లక్ష్మణ్‌యాదవ్‌, ఫయాజ్‌, అజ్మత్‌అలీ తదితరులు పాల్గొన్నారు.

ఇవి చదవండి: బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ప్రజలకు చేసిందేమీలేదు : మంత్రి సీతక్క

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement