కృత్రిమ పాలు.. అనారోగ్య పాలు! | Sakshi
Sakshi News home page

కృత్రిమ పాలు.. అనారోగ్య పాలు!

Published Wed, Jan 3 2024 4:36 AM

- - Sakshi

అచ్చంపేట రూరల్‌: పాడి ఉత్పత్తిలో అగ్రగామిగా నిలిచిన ఉమ్మడి పాలమూరు జిల్లా.. ప్రస్తుతం కల్తీపాలతో మసకబారుతోంది. అక్రమ వ్యాపారులకు అడ్డాగా నిలుస్తోంది. ధనార్జనే ధ్యేయంగా కొందరు హానికరమైన రసాయనాలతో కృత్రిమ పాలు తయారు చేస్తున్నారు. వాటితో పన్నీరు, కోవా, పెరుగు తదితర పదార్థాలను తయారుచేసి విక్రయిస్తున్నారు. అక్రమార్కుల పా‘పాల’తో అందరి ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు.

డిమాండ్‌ పెరగడంతో..
పసిబిడ్డల నుంచి వృద్ధుల వరకు పాలు, టీ తాగుతుంటారు. అలాగే పెరుగు, కోవా, పన్నీరు, నెయ్యి తదితరాలు మనిషి జీవనంలో భాగమయ్యాయి. హైదరాబాద్‌ నగరం సమీపంలో ఉండటంతో పాలకు మరింత డిమాండ్‌ పెరిగింది. గృహ యజమానులు, హోటళ్లు, మిఠాయి దుకాణాలకు రోజుకు వేల లీటర్లలో సరఫరా చేస్తున్నారు. జిల్లాలో సుమారు 5 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి.

వాటిని విజయ డెయిరీతో పాటు ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. మరికొందరు రైతులు నేరుగా విక్రయిస్తున్నారు. పాల డిమాండ్‌ విపరీతంగా పెరగడంతో అక్రమార్కులు కృత్రిమంగా పాలు తయారు చేసి.. కాసులు దండుకుంటున్నారు.

పట్టణ ప్రాంతాల్లో అధికం..
పట్టణ ప్రాంతాల్లో పాల విక్రయ కేంద్రాలు అధికంగా వెలుస్తున్నాయి. పల్లెల నుంచి పాలను తీసుకొస్తున్నామని చెబుతూ క్యాన్లలో అక్కడక్కడ విక్రయాలు సాగిస్తున్నారు. అమాయక ప్రజలు వీరిని నమ్మి పాలను కొనుగోలు చేస్తున్నారు. దశాబ్ద కాలంగా కృత్రిమ పాల తయారీ దందా సాగుతున్నా.. ఆహార పరిరక్షణ, స్థానిక యంత్రాంగం గుర్తించలేకపోతోంది.

రసాయనాలు, పాలపొడి, నూనె, యూరియా, నీటి మిశ్రమాన్ని కలిపి తయారు చేసే ద్రావణంతో కృత్రిమ పాలను తయారు చేస్తున్నారు. కొందరు వెన్న తీసిన పాలలో యూరియా కలిపి వెన్న శాతాన్ని పెంచుతున్నారు. వెన్న శాతం ప్రకారం లీటరు పాలు రూ.40 నుంచి రూ.60 వరకు రైతుల వద్ద లభిస్తున్నాయి. సాధారణ వ్యక్తులు కృత్రిమ పాలను గుర్తించలేరు. మరికొందరు పాలలో మీగడ తీసి యూరియా, నూనె ప్యాకెట్లు, సర్ఫు ద్వారా కృత్రిమ పాలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

కఠిన చర్యలు తప్పవు..
అచ్చంపేటలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న నాలుగు సెంటర్ల యజమానులకు నోటీసులు జారీ చేశాం. వారి నుంచి పాల శాంపిళ్లను సేకరించాం. హైదరాబాద్‌లోని స్టేట్‌ ల్యాబరేటరీకి శాంపిళ్లను పంపిస్తాం. పాలలో కల్తీ ఉన్నట్లు నిర్ధారణ అయితే కఠిన చర్యలు తప్పవు. ప్రజల ఆరోగ్యానికి హాని కల్గిస్తే ఉపేక్షించేది లేదు.  – మనోజ్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌

అచ్చంపేటలో మెరుపు దాడులు...
అచ్చంపేటలో కృత్రిమ పాలు విక్రయిస్తున్నారని ఫిర్యాదులు అందడంతో మంగళవారం ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ మనోజ్‌ ఆధ్వర్యంలో పలు ప్రైవేటు పాల విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు. లింగాల రోడ్డులోని శ్రీనివాస మిల్క్‌ సెంటర్‌, రైతు పాల విక్రయ కేంద్రంతో పాటు మరో రెండు సెంటర్‌లను పరిశీలించి, పాల శాంపిల్స్‌ సేకరించారు. అలాగే బస్టాండ్‌, పాత బజార్‌ ప్రాంతాల్లోని పాల విక్రయ కేంద్రాలను తనిఖీ చేశారు.

కాగా.. గత డిసెంబర్‌లో ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ అచ్చంపేటలోని పాల కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడ కల్తీ చేయడంతో పాటు పాడి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వచ్చిన ఆరోపణల మేరకు తనిఖీలు చేపట్టి.. కృత్రిమ పాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Advertisement
Advertisement